KTR | తమకు ఉన్న హక్కులు, నిధులు, విధుల గురించి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాజ్యాంగం ప్రకారం ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు సొంత ఆస్తులు, డబ్బులు కావని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తారని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూపాయి వస్తే.. మరో రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీలకు పథకాలను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
తాండూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ విమర్శించారు. మాకే నిధులు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా చెప్పిండని గుర్తుచేశారు. నిధులు ఇవ్వాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట అభివృద్ధి అనేది ఉండదని అన్నారు. కేసీఆర్ హయాంలో డంపింగ్ యార్డ్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల 21 జాతీయ పంచాయతీ అవార్డులను తెలంగాణ సాధించిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు గెలవడం సులభం.. కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే కష్టమని కేటీఆర్ తెలిపారు. ఈ రెండేళ్లు మనకు కష్టంగా ఉంటుందని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో అన్నారు.
రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. షాపుల యూరియా ఇవ్వనోడు.. యాప్‌ల యూరియా ఇస్తాడంట అని ఎద్దేవా చేశారు. 2014 నాటికి తెలంగాణ అప్పు రూ.72 వేల కోట్లుగా ఉందని తెలిపారు. 2023 నాటికి తెలంగాణ అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లు అయ్యిందని అన్నారు. అంటే.. బీఆర్ఎస్ హయాంలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేశారని వివరించారు. అంటే కేసీఆర్ చేసిన మొత్తం అప్పు రూ.2.80 లక్షల కోట్లే అని తెలిపారు. అదే రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి ఏంచేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ తెలిపారు. తాండూరులో ఉండే 36 వార్డుల్లో ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని అన్నారు.