హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఈ-రేస్‌లో అవినీతి జరగలేదని, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ చేసే ప్రతీపనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంవత్సరకాలంగా ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో ఎండగడుతున్న క్రమంలో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కేసుకు భయపడబోమని పునరుద్ఘాటించారు. రాజకీయంగా ఎదుర్కొంటూనే న్యాయస్థానంలో తమ వాదన వినిపిస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బ్యాంకు నుంచి బ్యాంకు లావాదేవీలు జరగడం వాస్తవమని, ఆ పంపిణీ విధానమే తప్పు అని పేర్కొన్నారు. అవినీతి జరగలేదని తెలిసినా ముఖ్యమంత్రి, మంత్రులు ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
తప్పులను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ డ్రామా
అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను, ప్రజలను తప్పుదారి పట్టించినట్టు ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీశ్‌రావు సభలో తూర్పారబట్టారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు తప్పని హరీశ్‌రావు ఎండగట్టడంతో ఏం చేయాలో పాలుపోక తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఏడాది కాలంగా చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌నే ప్రయోగించిందని తెలిపారు.
ఓఆర్ఆర్ లీజుపై విచారణ చేయండి
ఓఆర్ఆర్ లీజుపై సిట్టింగ్ జడ్జితో గానీ, రిటైర్డ్ న్యాయమూర్తితో గానీ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టోల్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ మార్గదర్శకాలకు లోబడే లీజు ఒప్పందాలు జరిగాయని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఒప్పందం ద్వారా వచ్చిన రూ. 7340 కోట్లను రైతుబంధుకు వినియోగించామని వివరించారు. అప్పటి క్యాబినెట్ సబ్‌కమిటీ సూచనలు చేసిందని, ఓఆర్ఆర్ను లీజుకిచ్చి తద్వారా వచ్చిన మొత్తాన్ని రైతు క్షేమం కోసం వినియోగించామే తప్ప అది దుర్వినియోగం కాలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నట్టు ప్రైవేట్ కంపెనీకి లేదా వ్యక్తులకు లబ్ధిచేకూర్చేలా ఒప్పందం జరిగిందని భావిస్తే దానిని రద్దు చేయాలని సవాల్ చేశారు. గతంలో ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్‌రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేసినందుకు హెచ్ఎండీఏ ఆయనపై పరువునష్టం దావా వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతున్నదని చెప్పారు.