హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల మధ్య ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సిందేనని సీసీఐ ఒత్తిడి చేస్తుండగా.. ససేమిరా అంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు మొండికేస్తున్నాయి. సుమారు నెల రోజులుగా ఈ పంచాయితీ నడుస్తూనే ఉన్నది. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తున్న మిల్లుల యాజమాన్యాలు రెండుసార్లు టెండర్లలో పాల్గొనలేదు. దీంతో సీసీఐ మూడోసారి టెండర్లు పిలిచింది. ఓవైపు పత్తి పంట చేతికొస్తున్నది. మరోవైపు మార్కెట్లో ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య పంచాయితీని పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలంటూ ఇటీవల మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా ఉండటం గమనార్హం.
గతంలో పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది సీసీఐ పలు కొత్త నిబంధనలు రూపొందించింది. ఇందులో భాగంగా లింట్ పర్సంటేజీని పెంచింది. మిల్లులకు గ్రేడింగ్ ఇచ్చి ఎల్1, ఎల్2, ఎల్3గా విభజించింది. సదరు మిల్లుకు 15 కిలోమీటర్ల దూరంలోని పత్తి మాత్రమే వచ్చేలా నిర్ణయించారు. దీంతోపాటు రైతులకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి జిన్నింగ్ మిల్లులో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ఆరు నెలల బ్యాక్అప్ను సీసీఐకి అప్పగించాలని నిబంధన పెట్టారు. అయితే కొన్ని నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
2024-25లో లింట్ పర్సంటేజీ (క్వింటాలు పత్తికి వచ్చే దూది శాతం) 31.45 శాతం ఉండేది. దీన్ని ఈ ఏడాది ఆదిలాబాద్ రీజియన్లో 31.75 శాతానికి పెంచారు. దీన్ని మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. దూది శాతం పెరగదని, నిరుటి నిబంధననే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎల్1, ఎల్2, ఎల్3 నిబంధన ద్వారా తొలుత ఎల్1 మిల్లు పూర్తి కెపాసిటీ పత్తి నిండిన తర్వాత ఎల్2కి, ఆ తర్వాత ఎల్3కి పత్తిని కేటాయిస్తారు. ఈ నిబంధనల వల్ల కిందిస్థాయి మిల్లులు నష్టపోతాయని అంటున్నారు. ఇక 15 కిలోమీటర్ల దూరం, ఒక జిల్లా పరిధిలోని పత్తి ఆ జిల్లాలోని మిల్లులకే వెళ్లాలనే నిబంధనపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిబంధనల వల్ల అర్బన్ ప్రాంతాల్లోని మిల్లులు నష్టపోతాయని, దూరాన్ని 60-70 కిలోమీటర్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ అధికారులు పత్తి అమ్మకాల్లో రైతులకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒకవేళ చదువురాని రైతులు నేరుగా మిల్లులకు వెళ్లినా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ రెండు విధానాల వల్ల రైతులకు, తమకు మధ్య గొడవలు జరుగుతాయని, ఏదో ఒక విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్న మిల్లులు.. టెండర్లను బహిష్కరించాయి. దీంతో రెండు రోజుల క్రితం మళ్లీ టెండర్లు పిలిచారు. నిబంధనలు సడలించకపోతే ఈ టెండర్లలో సైతం పాల్గొనబోమని జిన్నింగ్ మిల్లర్లు తెగేసి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జిన్నింగ్ మిల్లులు, సీసీఐ మధ్య ఒప్పందాలు పూర్తయ్యాయి. కానీ తెలంగాణ, ఏపీలో మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు సమాచారం. ఈలోగా రాష్ట్ర అధికారులు, మిల్లర్లతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ మూడోసారి కూడా టెండర్లు విఫలమైతే.. పత్తి కొనుగోళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పత్తి రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.