కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఒక జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కానిస్టేబుల్ మరో జిల్లాకు బదిలీపై వెళ్లాలంటూ నిబంధన పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. బదిలీల మార్గదర్శకాల్లో మానవీయ కోణం లోపించిందన్న విమర్శలొస్తున్నాయి. 2018లో ఆనాటి ప్రభుత్వం పనితీరుకు పెద్ద పీటవేసి, గ్రేడింగ్‌లు ఇచ్చి బదిలీలు చేయగా,.. ప్రస్తుత ప్రభుత్వం సీనియార్టీని తెరపైకి తెచ్చింది. అయితే, చాలా జోన్లలో సీనియార్టీ అంశంపై కోర్టు కేసులు ఉన్నాయి. ఇదే కారణంతో ఆయా జోన్లలో ప్రమోషన్లను నిలిపివేసిన అధికారులు… ఇప్పుడు బదిలీలకు మాత్రం ఆదే సీనియార్టీని వర్తింపజేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల కోసం రూపొందించిన మార్గదర్శకాలు, ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర దుమారం రేగుతున్నది. ఈ విషయంపై ఉద్యోగులు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తున్నది.
పెద్ద మొత్తంలో బదిలీలకు శ్రీకారం
ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లను పెద్ద మొత్తంలో బదిలీ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 500 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 2,500 మంది కానిస్టేబుళ్లు ఆ శాఖలో పనిచేస్తున్నారు. తాజా మార్శదర్శకాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలి. వాటిని పరిశీలించిన అనంతరం 9వ తేదీన పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. 10న కొత్త పోస్టుల్లో జాయిన్కావాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. బదిలీ ఆర్డర్లు జారీ అయిన నాటి నుంచి కేవలం మూడు రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్ తీసుకోకపోయినా, తీసుకొని జాయిన్ కాకపోయినా సంబంధిత సిబ్బంది తమకు కేటాయించిన జిల్లాలో జాయిన్ అయినట్టుగానే ట్రీట్ చేస్తామని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల తదుపరి జరుగుతున్న జనరల్ బదిలీల్లో న్యాయం జరుగుతుందని భావించిన సిబ్బందికి తాజా మార్గదర్శకాలు పెనుశాపంగా మారాయన్న ఆవేదన వ్యక్తమవుతున్నది.
జిల్లాల్లో ఉండొద్దు
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ సాధారణ బదిలీలు చివరిసారిగా 2018లో జరిగాయి. అప్పుడు వారి పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చి, బదిలీలను సజావుగా పూర్తిచేశారు. దీనివల్ల పనితీరు కనబరిచిన సిబ్బందికి న్యాయం జరిగిందని, మంచి ప్రాంతాల్లో పోస్టింగ్ రావడానికి ఆస్కారం ఏర్పడిందన్న అభిప్రాయాన్ని నాడు సిబ్బంది వ్యక్తంచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ తప్పనిసరిగా జిల్లా దాటి వెళ్లాలని బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్నది. దీంతో దాదాపు 95% మందిపై బదిలీ వేటు పడనున్నది. ఓ కానిస్టేబుల్ జిల్లాలు దాటి వేరే జిల్లాకు వెళ్లడం వల్ల అనేక సమస్యలొస్తాయని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గతంలో 317-జీవో ప్రకారం అప్పట్లో జరిగిన ఉద్యోగుల సర్దుబాటు వల్ల కొంతమంది ఉద్యోగులు స్థానికత కోల్పోయారంటూ విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఓ సబ్ కమిటీని నియమించింది. ఆ మేరకు కొన్ని బదిలీలు కూడా చేశారు. ఆ తదుపరి దానిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. కానీ, ఇదే సర్కార్ ఇప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ బదిలీల విషయంలో స్థానికత కోల్పోయేలా నిర్ణయాలు తీసుకున్నదన్న విమర్శలొస్తున్నాయి. జిల్లా దాటి ఇతర జిల్లాకు వెళ్లడం వల్ల వారి పిల్లలు స్థానికత కోల్పోయే ప్రమాదం ఉన్నదన్న ఆవేదన సిబ్బందిలో వ్యక్తమవుతున్నది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల వృద్ధ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకోవడానికి వీలుపడదన్న ఆందోళన నెలకొన్నది. ఈ నిబంధనను ఎత్తివేయాలంటూ ఇప్పటికే అన్ని జిల్లాల ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తూ వచ్చాయి. కానీ, సర్కార్ నుంచి సానుకూల స్పందన రాలేదు.
మానవీయ కోణం ఏదీ?
ఉద్యోగులకు జరిగే బదిలీల్లో అనేక అంశాల్లో మానవీయ కోణం చూపుతూ గత ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. కానీ, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ప్రస్తుత సర్కార్ మానవీయ కోణం విస్మరించింది. సాధారణంగా బదిలీల్లో స్పౌజ్ క్యాటగిరీకి ముందుగా అవకాశం కల్పిస్తారు. కానీ, ఇక్కడ సదరు కానిస్టేబుల్ కూడా జిల్లా దాటి వెళ్లాలనే నిబంధన పెట్టారు. దీనివల్ల భార్యాభర్తలు వేరువేరు జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, వితంతువులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యమిస్తారు. కానీ, వీరికి కూడా జిల్లాలు దాటాలన్న నిబంధన పెట్టారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ప్లాంటేషన్, ఓపెన్‌హార్ట్ సర్జరీ, బోన్టీబీ వంటి అరు రకాల జబ్బులు ఉద్యోగులకు ఉన్నా, లేదా కుటుంబ సభ్యులకు ఉన్నా బదిలీల్లో ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు ఈ విషయానికి సైతం మంగళం పాడారు. పై ఆరు రకాల జబ్బులు ఉద్యోగులకు, లేదా కుటుంబ సభ్యులకు ఉన్నా సరే బదిలీపై ఇతర జిల్లాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. నిజానికి గతంలో పై ఆరు రకాల జబ్బులున్న వారికి సంబంధిత దవాఖానలున్న చోట పోస్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ అవకాశం లేదు.
మద్యం విక్రయాలే పరమావధిగా..
ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నది. టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు జరిగేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. మద్యం విక్రయాలు మరింత పెంచేందుకే ప్రభుత్వం పెద్దమొత్తంలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వడం వల్ల సిబ్బంది ఎక్కువ ఫోకస్ పెడుతారని, టార్గెట్లు పూర్తిచేయడానికి ఎక్కువ అవకాశాలుంటాయని, తద్వారా సర్కార్‌కు ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతోనే బదిలీలకు శ్రీకారం చుట్టినట్టు చర్చించుకుంటున్నారు.
ప్రమోషన్లకు వచ్చిన అడ్డంకి బదిలీలకు వర్తించదా?
సీనియార్టీ అంశంపై అనేక జోన్లలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. చాలామంది కోర్టును ఆశ్రయించారు. భద్రాద్రి, బాసర, రాజన్న జోన్ పరిధిలో ఈ సమస్య అధికంగా ఉన్నది. మెజారిటీ సిబ్బంది సీనియార్టీ అంశంపై కోర్టుకు వెళ్లారు. సీనియార్టీ అంశం కోర్టులో ఉన్నందున ఇన్నాళ్లూ అక్కడ ప్రమోషన్లు ఇవ్వడం లేదని అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. తాజా బదిలీలకు మాత్రం ఇదే సీనియార్టీని అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రమోషన్లకు అడ్డుపడిన కోర్టు కేసులు ఇప్పుడు బదిలీలకు వర్తించవా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మార్గదర్శకాల్లో ఉన్న లోపాలను సవరించి గతంలో మాదిరిగా బదిలీలు చేపట్టాలంటూ ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ అసోసియేషన్లు సర్కార్‌కు విన్నవించాయి. అయినా, సర్కార్ మొండిగా ముందుకు పోతున్నదన్న చర్చ ఎక్సైజ్ శాఖలో నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో మెజారిటీ కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీల అంశంపై కోర్టుకు వెళ్లారని తెలుస్తున్నది. మరికొంత మంది సైతం ఇదే బాటలో ఉన్నారు. దీనిపై ఒకటి రోజుల్లో కోర్టు నుంచి క్లారిటీ వస్తుందని కొంతమంది సిబ్బంది భావిస్తున్నారు.