హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతల కల్లు దందాపై రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ‘కల్తీకల్లు దందాలో సిండికేటు’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా అధికారులు కాంగ్రెస్ పెద్ద వివరాలు కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఈ సిండికేట్‌లో ఉన్న కాంగ్రెస్ నేతల వివరాలు కావాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ ఉన్నతాధికారులకు కూడా తలంటడంతో వారు సైతం స్పెషల్ డ్రైవ్ ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా కల్లు డిపోలపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం వెల్లడించారు. వారంరోజులు పాటు కల్లు అమ్మకాలు జరిగే కాంపౌండ్లపై స్టేట్ టాస్‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు దాడులు చేపట్టడంతో పాటు.. కల్లు నమూనాలు సేకరిస్తాయని తెలిపారు. అక్రమంగా నిర్వహించే కల్లు దుకాణాలను సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎంతటి పెద్దవారు ఉన్నా.. నాయకులు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతల అండదండలతో రెచ్చిపోతున్న అల్ఫ్రాజోలం సిండికేట్.. విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నదని గౌడన్నలు ఆరోపిస్తున్నారు. ఈ సిండికేట్ మొత్తానికి మహారాష్ట్ర నుంచే అల్ఫ్ప్రాజోలం సరఫరా అవుతున్నట్టు గుర్తించామని ఓ ఎక్సైజ్ ఉన్నతాధికారి చెప్పారు. వారు దుకాణాల్లో కిలో అల్ఫ్రాజోలం వెనుక సుమారు రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. పది గ్రాముల అల్ఫ్రాజోలంతో సుమారు 1500 వందల కల్లు సీసాలు తయారు చెయ్యొచ్చని అంటున్నారు. కామారెడ్డి కల్తీకల్లు ఘటనలో ఈ రాకెట్ పాత్ర అత్యంత కీలకంగా ఉండటంతోపాటు.. కాంగ్రెస్ నేతల అండదండల కారణంగా ఈగల్ టీమ్ సైతం పైపైన దాడులు నిర్వహించినట్టు తెలిసింది. ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే కామారెడ్డి మొత్తం కల్తీకల్లు తాగొద్దంటూ ప్రచారం నిర్వహించినట్టు సమాచారం. గత ఐదేండ్లలో అల్రాజోలం కేసులు పరిశీలిస్తే.. 2020 నుంచి 2023 చివరి వరకూ భారీగా కేసులు, అరెస్టులు చేయడంతోపాటు అధిక మొత్తంలో అల్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. 2024 నుంచి ఆ లెక్కలు తారుమారు అవుతూ వచ్చాయి.