Model Schools | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్థులున్నా.. టీచర్లు లేని పరిస్థితి ఈ స్కూళ్లల్లో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ మాడల్ స్కూల్లో ఒక్కరంటే ఒక్క టీచర్కూడా లేరు. ఈ స్కూళ్లో గతంలో 10 మందికి పైగా టీచర్లు పనిచేసేవారు. కానిప్పుడు ఒక్క టీచర్కూడా లేరు.
ఇక ఇదే జిల్లాలోని నార్నూరు మాడల్ స్కూళ్లో ఇదే పరిస్థితి. ఇటీవలీ టీచర్ల బదిలీలతో రాష్ట్రంలోని పలు మాడల్ స్కూళ్లు కుదేలయ్యాయి. పలు స్కూళ్లల్లో టీచర్ల కొరతకు దారితీసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని మాడల్ స్కూళ్లు టీచర్లతో నిండిపోగా, మారుమూల ప్రాంతాల్లోని మాడల్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అత్యంత మారుమూల ప్రాంతాలు, రాష్ట్ర సరిహద్దులోని స్కూళ్లు, సంగారెడ్డి జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని టీచర్లంతా బదిలీలకు పట్టణ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే ఇతరులు వీటికి ఎంపికచేసుకోకపోవడంతో ఇప్పుడా స్కూళ్లల్లో టీచర్ల కొరత సమస్యకు దారితీసింది. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి.
శనివారం టీచర్ల బదిలీలు చేపట్టగా, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీపీల చొప్పున మొత్తంగా 2,757 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వాస్తవానికి ఒక్కో మాడల్ స్కూల్ కనీసంగా 500 మంది విద్యార్థులుంటారు. ప్రతి స్కూళ్లో కనీసంగా 20 మంది టీచర్ల అవసరముంటుంది. తాజా బదిలీలతో ఒకట్రెండు స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్లేకుండా పోయారు. మరికొన్ని మాడల్ స్కూళల్లో ముగ్గురు, నలుగురు టీచర్లే ఉన్నారు.
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలతో టీచర్లు సంతోషంలో ఉండగా, ఇదే పాఠశాలల్లో పనిచేస్తున్న అవర్లీబేస్డ్ టీచర్లు(హెచ్‌బీటీ) ఉపాధి కోల్పోయారు. ఇది వరకు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంలో హెచ్‌బీటీలను తీసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది హెచ్‌బీటీలు పనిచేశారు. తాజా బదిలీల్లో రెగ్యులర్ టీచర్లు రావడంతో హెచ్‌బీటీలను తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యాసంవత్సరం మధ్యలో హెచ్‌బీటీలను అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో బదిలీలతో డిస్టర్బ్ అయిన హెచ్‌బీటీలను పక్క మండలాలు, అదేజిల్లాల్లో ఖాళీగా ఉన్న స్కూళ్లల్లో అవకాశం కల్పించిన న్యాయం చేయాలని, కుటుంబాలను ఆదుకోవాలని హెచ్బీటీల సంఘం అధ్యక్షుడు రెడ్డబోయిన నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.