CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోరు జారుతూ అభాసుపాలు అవుతున్నారని రాజకీయవర్గాలు మండిపడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా రేవంత్ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. దావోస్‌లో ఓ జాతీయ మీడియా చానల్‌తో సీఎం రేవంరెడ్డి మాట్లాడుతూ పాలసీ మేకర్‌గా, నాయకుడిగా తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అసలు కంప్యూటర్ ఆన్, ఆఫ్ చేయడం తెలియదని చెప్పారు. ఇవే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పీవీ ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నారని ఆ మేరకు పీవీ పాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ఇదే ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ‘డాటా ఎంట్రీ ఆపరేటర్’ అంటూ రేవంత్ చులకన చేసి మాట్లాడారు. సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగులకు కేవలం వర్కర్స్ మైండ్‌సెట్ ఉంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఓ సభలో దేశంలోని నగరాల కాలుష్యంపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచలోనే ‘చెత్త నగరం’ విభాగంలో కోల్‌కతా మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. సీఎం రేవంత్ కోల్‌కతాను సందర్శించాలని సూచించారు. నిరాధారమైన వాదనలపై స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఢిల్లీ నివాసయోగ్యమైన నగరం కాదని, చెన్నైలో తరచూ వరదలు వస్తాయని, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అని, ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్‌రెడ్డి నోరు జారుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి.
రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్మాదులుగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు తప్పుబట్టారు. హైదరాబాద్ నగరానికి, రాష్ర్టానికి మూడు వైపుల సముద్రం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం విస్మయానికి గురి చేశాయి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు దొరకుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్‌కు గురయ్యాయి. మొత్తానికి రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషపట్ల సోషల్ మీడియాలో రాజకీయ, మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో విమర్శలకు దారితీస్తున్నది.