హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్అండ్టీ సంస్థ తప్పుకోవడం వెను క భారీ భూదందా దాగి ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రోకు నగరంలోని పలు ప్రాంతాల్లో 300కు పైగా ఎకరాల భూములు న్నాయి. వీటిని చేజిక్కించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో డీల్‌ను తెరమీదికి తెచ్చింద ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెట్రోకు నగరవ్యాప్తంగా ఉన్న ల్యాండ్ పార్శిళ్లు, మాల్స్‌పై పెద్దల కన్ను పడిందని చెప్తున్నారు. ఇన్నేండ్లుగా నష్టాలను దిగమింగిన ఎల్అండ్టీ సంస్థ ఉన్నట్టుండి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వెనుక పెద్దల ఒత్తిళ్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేయడంతో ఇటు వ్యాపార వర్గాల్లో, అటు రా జకీయ వర్గాల్లో మెట్రో డీల్ చర్చనీయాంశంగా మారింది. మెట్రో వ్యవస్థలో రెండు భారీ డిపోలతోపాటు, 57 స్టేషన్లు ఉన్నాయి. దీని నిర్మాణానికి అప్పట్లో రూ.18,880 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 70% రుణాలతో సర్దుబా టు చేయగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సంస్థ భరించింది.
రాష్ట్ర వాటాగా ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం 300 ఎకరాల భూమి ని కట్టబెట్టింది. ఈ భూమిని డెవలప్ చేయడం ద్వారా మెట్రో నిర్వహణ సంస్థ ఏటా 55% రెవెన్యూ సృష్టించాలని ఒప్పందంలో ఉన్నది. మాల్స్ నిర్మాణం, మెట్రోస్టేషన్ల వద్ద కమర్షియల్ స్పేస్‌ను లీజుకివ్వడం ద్వారా రెవెన్యూ సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. స్టేషన్ల నిర్మాణాల్లో 70-80% మెట్రో అవసరాలకు వినియోగించి, మిగిలిన 20% స్థలాన్ని నిర్మాణ సంస్థ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇందులో అత్యధిక శాతం భూములను వినియోగంలోకి తేవడం లో ఎల్అండ్టీ విఫలమైంది. ప్రస్తుతం మి యాపూర్ డిపో కోసం 99 ఎకరాలు, ఫలక్‌నుమా (నిర్మాణం కాలేదు) వద్ద 17 ఎకరాలు, నాగోల్ డిపో వద్ద మరో 96 ఎకరాలు కలిపి మొత్తంగా 212 ఎకరాలు ఖాళీ స్థలాలు న్నాయి. వీటితోపాటు 25 మెట్రో స్టేషన్ల సమీపంలో మరో 57 ఎకరాలు ఖాళీ జాగాలున్నా యి. మరో 30 ఎకరాల విస్తీర్ణంలో మెట్రో స్టేషన్లపై భాగంలో ల్యాండ్ బ్యాంక్ కలిపి 300 ఎకరాల మేర భూములున్నట్టు అధికార వర్గా లు తెలిపాయి. మార్కెట్ లెక్కల ప్రకారం ఈ ల్యాండ్ విలువ రూ.14 వేల కోట్ల నుంచి రూ.16వేల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ భూములకు ఉన్న విలువతోనే ప్రభుత్వం ఈక్విటీ షేర్ కొనుగోలుకు ఆసక్తి చూపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన భూములను వినియోగంలోకి తీసుకొచ్చి, వాణిజ్యపరమైన లావాదేవీలు పెరిగితే మెట్రోకు భారీ స్థాయిలో లాభా లు ఉండేవి. కానీ టికెట్, ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంపై మాత్రమే మెట్రో నిర్వహణ సంస్థ ఆధారపడింది. దీంతో ఏటా నష్టాల భారం పెరుగుతూ పోయింది. మెట్రో నిర్వహణ నుంచి ఇప్పుడు ఎల్ అండ్ టీ తప్పుకోవడంతో విలువైన భూములకు ఉన్న అడ్డంకు లు తొలిగిపోయాయి. ఈ భూములను ప్రభు త్వ అవసరాలు, ఆదాయ వనరుల సమీకరణ పేరిట అప్పణంగా కట్టబెట్టే వీలు ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు దాగున్న ప్రయోజనాల వల్లే ఎల్అండ్టీ సంస్థ వైదొలిగిందని ఆరోపణలున్నాయి. ఇదే నిజమై తే విలువైన మెట్రో భూములను ప్రభుత్వం తమ అస్మదీయులకు అగ్గువకు కట్టబెట్టే అవకాశం ఉన్నదని, చివరికి ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకుంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. భూముల డెవలప్మెంట్ ద్వారా ఆశించినంత ఆదాయం వచ్చే అవకాశాలు లేకపోవడంతో గతంలో ఎల్అండ్టీ సంస్థ వెనక్కి తగ్గింది. కానీ రియల్ ఎస్టేట్‌పై సంపూర్ణ అవగాహన కలిగిన సీఎం రేవంత్ ఈ భూముల విలువను గుర్తించే తాజా ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. ముందుగా ప్రభుత్వం రూ.15వేల కోట్ల అప్పుల భారాన్ని మోస్తున్నదని, వీటిని అధిగమించడానికి భూములను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నామని ప్రచా రం చేస్తారని పేర్కొంటున్నారు. తర్వాత అప్పు ల భారం తగ్గించుకునే పేరుతో భూములను ఆత్మీయులు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
మెట్రోకు 3 మాల్స్ ఉన్నాయి. వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీలో ఎల్అండ్టీ వీటిని నిర్మించిం ది. వీటిలో 15 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉన్నది. అయితే ఈ మాల్స్ భవిత ప్రశ్నార్థకంగా మారింది. మెట్రో నిర్వహణ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడంతో హాట్ కేకుల్లాంటి మెట్రో మాల్స్ కూడా ప్రభుత్వ పెద్దలను ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పెద్దల సొంత వ్యాపారాలకు అనువుగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.