సిద్దిపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్‌చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది. సోమవారం ఉదయం రంగనాయక సాగర్‌లోకి 3,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసింది. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధ్దం చేసింది. గొలుసుకట్టు క్రమంలో అన్ని రిజర్వాయర్లలోకి కాళేశ్వర జలాలు పంపింగ్ చేయనున్నారు.
వారం కిందట భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ సైతం రాశారు. ఆదివారం సిద్దిపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీటిని విడుదల చేయాలని గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని కోరారు.
గోదావరి నీళ్లను ఒడిసిపట్టి రిజర్వాయర్లు నింపాలని లేఖ ద్వారా, మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ప్రభుత్వం పంపింగ్ ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, రైతులు రంగనాయకసాగర్ వద్దకు వెళ్లి పూజలు చేశారు.