హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర ఒప్పందాలు, విభజన చట్ట ప్రకారం నీటి వాటాల పంపకాలు చేపడితేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొంటుందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఒకవైపు నల్లమలసాగర్ కడతామని ఏకపక్ష ప్రకటనలు చేస్తూ, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడితే ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తుంటే, మాజీ సీఎంలు చిచ్చుపెడుతున్నారంటూ ఆంధ్రా నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకుండా ఏపీ సర్కార్ అడ్డుపడుతూ, మరోవైపు సామరస్య మంత్రం పఠించడం శోచనీయమని మండిపడ్డారు. ‘రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొనాలంటే విభజన చట్టంలోని హామీలు, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలను అక్షరాల పాటించాలి. అప్పర్, లోయర్ రైపేరియన్ హక్కుల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటిచుక్కపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. చర్చల పేరిట కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్రలు ఆపాలి..’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఇరు రాష్ట్రాల హక్కులను పరస్పరం గౌరవించుకుంటూ, చట్టబద్ధమైన పద్ధతిలో నీటి వాటాలను పారదర్శకంగా పంచుకున్నప్పుడే సామరస్యం దానికదే నెలకొంటుందని కుండబద్దలు కొట్టారు. అంతేకానీ, ఒకరి పొలాలను ఎండబెట్టి, మరొకరు పండించుకోవాలనుకుంటే సామరస్యం కాదు.. అన్యాయమని పునరుద్ఘాటించారు.