హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, కులవృత్తుల ఆధారంగా సమగ్ర కులగణన, జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్స్ (ఎఫ్ఐసీఏ) ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రి శ్రీపాదనాయక్, కర్ణాటక మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, జేడీఎస్ నాయకుడు బాల్‌రాజ్ గుత్తేదార్, ఎఫ్ఐసీఏ అధ్యక్షుడు కుమార్గౌడ్తోపాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షే మం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జనగణనలో అన్ని రకా ల కులవృత్తులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గౌడ, కర్ణాటకలో ఈడిగ, ఏపీలో శెట్టి బలిజ, ఈడిగ, తమిళనాడులో నాడార్, కేరళలో బిల్ల వ, జైశ్వాల్, హల్వాడియ వంటి పలు రకాల పేర్లతో ఉన్న గౌడ సమాజాన్ని ‘కలాల్’ పే రుతో ఒకే కులంగా చూడాలని సూచించారు.
యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని, గౌడ సమాజానికి నీరా పాలసీ, వైన్‌షాపుల్లో రిజర్వేషన్లు, చెట్టు పన్ను రద్దు, ఉచిత టీఎఫ్టీ లైసెన్సులు వంటి కులవృత్తి ఆధారిత సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.