హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్య వసాయరంగం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి, వ్యూహరచన, పకా ప్రణాళిక, అందుకు తగ్గ కార్యాచరణతో వ్యవసాయ రం గాన్ని కొత్త పుంతలు తొక్కించారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అమలుపర్చిన అభివృద్ధి నమూనాను వివరించారు.
ప్రపంచంలో మరెకడా లేనివిధంగా కేసీఆర్ ‘రైతుబంధు’ పథకానికి రూపకల్పన చేసి రైతన్నలకు పెట్టుబడి సాయమందించి ఆదర్శంగా నిలిచారని వద్దిరాజు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లు నిర్మించి, కాలువలు తవ్వి రైతులకు సాగు నీరు అందించారని వివరించారు. వ్యవసాయంతోపాటు ఆయిల్‌పామ్ తోటల పెంపును కేసీఆర్ ప్రోత్సహించారని, దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
తెలంగాణలో కోతుల బెడద తీవ్రంగా ఉన్నదని, ఈ కారణంగా రైతులు కొన్ని పం టలు పండించడం లేదని వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కోతులు గ్రామాలను వీడి అడవుల బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం నుంచి సమానమైన వాటాను తమ రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తిచేశారు. పన్నుల చెల్లింపు ద్వారా సమకూరిన నిధులు సక్రమంగా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరా రు. సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాష్ట్రంలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి నిధులు విడుదల చేయాలని కోరారు. రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.