హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీచేసే ఫ్యామిలీ -24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకున్నది. ఈ టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపాల్సి ఉంటుంది. ప్రయాణికుల వయసు నమోదు చేయాలి.
మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతున్నది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతున్నది. దీంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఈ రెండు టికెట్లను ఉపసంహరించుకోవాలని సంస్థ నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.