హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. టెండర్లో ధర తక్కువగా వచ్చిందని, రీటెండర్‌కు ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని ఆర్థికశాఖ సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సైతం టెండర్ రద్దుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు సోమవారం టెండర్ కమిటీ భేటీ కానున్నది. ఈ భేటీలో టెండర్ రద్దుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గత వానకాలంలో ప్రభుత్వం రైతుల నుంచి 3.80 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది.
ఇవన్నీ కూడా గోదాముల్లోనే నిల్వ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మక్కల కొనుగోలుకు గోదాముల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వానకాలం మక్కలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్క్‌ఫెడ్ తొలిసారి 123 గోదాముల వారీగా టెండర్లు పిలువగా 62 గోదాములకు క్వింటాకు రూ.1,500 ధర వచ్చినట్టు తెలిసింది. మిగతా 61 గోదాములకు అసలు బిడ్లే దాఖలు కాలేదని తెలిసింది. దీంతో ఆ టెండర్లను రద్దుచేసిన ప్రభుత్వం మరోసారి టెండర్‌కు వెళ్లింది. ఈసారి ఒక్కో లాట్‌కు 76,037 చొప్పున ఐదు లాట్లుగా విభజించి టెండర్ వేసింది. ఈ టెండర్లో సగటు ధర క్వింటాలుకు రూ.1,410 వచ్చినట్టుగా తెలిసింది. ధర తక్కువగా పలికిందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అందుకే రీ టెండర్‌కు వెళ్లడం వల్ల ధర పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలిసింది.
వాస్తవానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 వెచ్చించి కొనుగోలు చేసింది. దీనికి అదనంగా గోదాముల స్టోరేజీ, రవాణా, గన్నీ సంచులు ఇలా పలు రకాల ఖర్చులు కలిసి క్వింటాకు రూ.100-150 వరకు అదనపు ఖర్చులు కావడం గమనార్హం. ధర క్వింటాలుకు రూ.1,410 లెక్కన ప్రభుత్వానికి క్వింటాకు సుమారు రూ.1,150 వరకు నష్టం వస్తున్నది. అంటే మొత్తంగా సుమారు రూ.450 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఆర్థికశాఖ మళ్లీ టెండర్‌కు వెళ్లే అంశాన్ని పరిశీలించాలని సూచించడం, వ్యవసాయశాఖ నిర్ణయించడం జరిగాయి.
తాజాగా టెండర్లను రద్దు చేయాలనే ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర తక్కువగా రావడమే టెండర్ రద్దుకు కారణమా? తెరవెనుక ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మరోసారి టెండర్‌కు వెళ్తే ప్రస్తుత టెండర్ కన్నా తక్కువ ధర వస్తే పరిస్థితి ఏమిటి? దీనికి ఎవరు బాధ్యులు? అన్న చర్చ కూడా మార్క్‌ఫెడ్‌లో జరుగుతున్నది. ధాన్యం ఎత్తడంలో విఫలమైన కేంద్రీయ భండార్, నాకాఫ్ను ఈ టెండర్లో అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మార్క్‌ఫెడ్ ఎండీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే పౌల్ట్రీ కంపెనీల ప్రతినిధులు తమకు మక్కలు కావాలని, క్వింటాకు రూ.1,600 ఇస్తామని లేఖ ఇచ్చినట్టు సమాచారం. అయితే వారు గతంలో టెండర్ మధ్యలో రావడంతో అవకాశం ఇవ్వలేపోయారని, ఇప్పుడు టెండర్లను రద్దు చేయడంతో వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. పౌల్ట్రీ నిర్వాహకులు రూ.1,600కు అంగీకరిస్తే మార్క్‌ఫెడ్‌కు కలిగే నష్టం తగ్గుతుంది. వీళ్లు ఈ ధరపై ఏ మేరకు నిలబడుతారనే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ తాజాగా టెండర్లోకి ఎంటరైనట్టుగా సమాచారం.