NEET-UG : ఈ ఏడాది నీట్ పేపర్ లీకేజీతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరీక్ష నిర్వహణా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ విషయాన్ని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పరీక్ష నిర్వహణ విషయంలో లోపాల్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై ఆగష్టు 6, గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. పరీక్ష నిర్వహించబోయే విధానంపై కేంద్రానికి వివరించింది.
దీని ప్రకారం.. ఇకపై నీట్-యూజీ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. పెన్, పేపర్ బదులు.. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో, అలాగే, జేఈఈ పరీక్షలాగా, రెండు దశల్లో పరీక్ష జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆన్లైన్ విధానంలో ఎనిమిది ప్రధాన పరీక్షల్ని నిర్వహిస్తోందని కేంద్రం తెలిపింది. అందువల్ల నీట్ పరీక్షను కూడా ఇలా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పింది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ తరహాలో రెండు దశల్లో ఈ పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థుల సామర్ధ్యాన్ని మరింతగా పరీక్షించే వీలుంటుందని, అవకతవకలకు అడ్డుకట్ట వేసి, మరింత భద్రంగా పరీక్ష నిర్వహించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో పరీక్ష నిర్వహణపై సంస్కరణల గురించి ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ఫోర్స్ సూచనలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వివరించింది. ఏ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని బలవంతంగా, ఏకపక్షంగా అమలు చేయబోమని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి విషయాన్ని విద్యార్థులకు వివరిస్తామని కూడా హామీ ఇచ్చింది. పరీక్ష కోసం విద్యార్థుల్ని తగిన విధంగా సిద్ధం చేస్తామని కూడా ప్రకటించింది.