Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పంటకు 33% నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి గురువారం మార్గదర్శకాలు జారీచేశారు. అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు దెబ్బతిన్న పంటల సమగ్ర గణన చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని సూచించారు. మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
పంట నష్టం జరిగిన ప్రతి వ్యవసాయ భూమిని ఏఈవోలు సందర్శించాలి. 33%, అంతకంటే ఎకువ నష్టం జరిగిన వాటి జాబితా తయారు చేయాలి. ఉద్యాన పంటల పంట నష్టాన్ని కూడా మండల వ్యవసాయాధికారే అంచనా వేయాలి. నష్టం అంచనాలను డీఏవోలు నిర్దారించాలి. ఏడీఏలు తమ పరిధిలోని ప్రతి మండలంలో 25% క్షేత్రస్థాయిలో సందర్శించి ఏఈవోలు చేసిన పంట నష్టం అంచనాను ధ్రువీకరించాలి. జిల్లా వ్యవసాయాధికారులు ప్రతి మండలంలో 5% పంట నష్టం జరిగిన భూములను సందర్శించాలి.
ప్రాధాన్యంగా మొదటి 5 ప్రభావిత మండలాల్లో పర్యటించాలి. మండలాలవారీగా నష్టం జాబితాలు సిద్ధం చేసి వ్యవసాయాధికారులు, కలెక్టర్ల సంతకంతో జాబితా తయారుచేయాలి.జాబితాలను గ్రామ పంచాయితీ భవనంలో రైతుల కోసం ప్రదర్శించాలి. కలెక్టర్ ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలను పంపించాలి. ఈ నెల 12 నాటికి జాబితాను హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయానికి పంపించాలి.