Tandur Govt Hospital | తాండూరు, ఫిబ్రవరి 3: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి కుట్రనే అని పేర్కొంటూ దవాఖాన ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తాండూరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. తాండూరువాసులకు ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా పేరు మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయడంలో భాగంగా తాండూరు దవాఖానను దానికి అనుసంధానంగా చేసే కుట్రలో భాగంగానే పేరు మార్చినట్టు ఆరోపించారు. తాండూరు నియోజకవర్గాన్ని కొడంగల్‌గా మార్చి ఇక్కడి ఎమ్మెల్యేను కొడంగల్ ఎమ్మెల్యేగా చేస్తారా..? ప్రజలను కొడంగల్వాసులుగా మారుస్తారా..? అని ధ్వజమొత్తారు. కాంగ్రెస్ వివక్షపాలనలో భాగంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకే ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.
ఈ విషయంపై దవాఖాన అధికారులను నిలదీస్తే తమకేమీ తెలియదని, కాంట్రాక్టర్ వచ్చి బోర్డు పెట్టినట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొడంగల్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకోసం తాండూరు జిల్లా దవాఖానను ఇలా పేరు మార్చి వాడుకుంటున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరుకు అన్యాయం చేస్తున్న రేవంత్‌రెడ్డి తీరును ఖండిస్తున్నట్టు ప్రకటించారు.