హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ‘స్వచ్ఛ్ బయో’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మొదట కంపెనీ పేరును సగం మాత్రమే బయటికి చెప్పి కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినా.. క్రమంగా ఎంవోయూ కుదుర్చుకున్నది ‘స్వచ్ఛ్ బయోగ్రీన్’తోనే అని పరోక్షంగా తేల్చి చెప్పారు.
కేవలం 15 రోజుల కిందట ప్రారంభమైన కంపెనీతో ఎలా ఒప్పందం చేసుకున్నారన్న ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో తెలియక వింత వాదనకు దిగుతున్నారు. సీఎం సోదరుడి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే తప్పేముందని ఒకరు ప్రశ్నించగా..‘పెట్టుబడులు ఎవరు పెడితే తప్పేముంది? అంటూ మరొకరు సందేహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ నేతలు బట్టకాల్చి మీదేస్తున్నారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడులు ఎవరు పెట్టారనేది ముఖ్యం కాదని.. ఆ సంస్థ పరపతి ఏమిటనేది ముఖ్యమని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు.
పెట్టుబడులు రావాలి.. రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సాగుతున్నదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి స్వచ్ఛ్ బయో కంపెనీ ఉన్నదని, వాళ్లే వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చెప్పారు. వాళ్లు పెట్టుబడులు పెడతామన్నారే తప్ప తెలంగాణ ఆస్తిని దోచుకుంటామని అనలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడితే ఏమిటి? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. తనకు లండన్లోనో, ఆస్ట్రేలియాలోనో ఉన్న దగ్గరి దోస్తులు వ్యాపారం చేయడానికి తెలంగాణకు వస్తే తప్పా అని అడిగారు. వారిని తాను తీసుకొస్తే తప్పా అని అన్నారు.