హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్‌రావును పోలీసు కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన శుక్రవారం ఉదయం 11గంటల లోపు ఈ కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
విచారణ సమయంలో ఆయన కు భౌతికంగా హాని తలపెట్టకుం డా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టంచేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆ హారం అందించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు సాగిన కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలన్నది ఆ రోజు చెప్తామని పేరొంది.
ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు అని అంతకుముందు జరిగిన విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి.. తాను అధికారంలోకి రాగానే ప్ర భాకర్రావును అరెస్ట్ చేయిస్తానని 2021లో, కార్యకర్తల సమావేశం లో ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.