Telangana | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సకాలంలో విత్తనాలు లభించని పరిస్థితి నెలకొన్నది. ప్రణాళిక మేరకు విత్తనాలు సరఫరా చేయకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం అవసరమైన విత్తనాల్లో సగం విత్తనాలను మాత్ర మే సరఫరా చేసింది. విత్తనాల కోసం గందరగోళం నెలకొన్నా, సీజన్ దగ్గరపడుతున్నా విత్తనాలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచడంలో వ్యవసాయశాఖ విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సీజన్లో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేసినప్పటికీ ఆ ప్రకారం విత్తన ప్యాకెట్లను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచటంలో వ్యవసాయశాఖ విఫలమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.1.26 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ఈ నెల 29 వరకు 51.40 లక్షల ప్యాకెట్లను సరఫరా చేసింది. అంటే ఇంకా 74.6 లక్షల ప్యాకెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోవటం గమనార్హం. ఆదిలాబాద్లో 10.46 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా 7.97 లక్షల ప్యాకెట్లనే అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ నెల 29 వరకు 79,261 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఇప్పటికే 54,162 క్వింటాళ్ల విత్తనాలను రైతుల కొనుగోలు చేశారు. ప్రణాళిక ప్రకారం ఇంకా 61,739 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నది. అత్యధిక డిమాండ్ గల జీలుగ విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఇందులో 65,668 క్వింటాళ్ల విత్తనాలనే అందుబాటులో ఉంచింది. ఇప్పటికే 45,412 క్వింటాళ్ల విత్తనాలను విక్రయించారు. ఇంకా 54,332 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నది.
‘అన్నీ ఉన్నాయి.. కానీ మీరు అడిగింది మాత్రం ఇవ్వలేం’ అన్నట్టుగా ఉన్నది పత్తి విత్తనాలపై ప్రభుత్వ తీరు. రైతులు డిమాండ్ చేస్తున్న పత్తి విత్తనాలను అందించటంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో అనేక కంపెనీల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయినా రైతులు ఒకటి, రెండు కంపెనీలకు చెందిన విత్తనాలనే కోరుకుంటున్నారు. ఆ విత్తనాలకు ప్రభుత్వం సరఫరా చేయలేకపోతున్నది. రైతులు డిమాండ్ చేస్తున్న విత్తనాలను అందుబాటులో ఉంచకుండా, ఇతర విత్తనాలను అందుబాటులో పెట్టి విత్తనాల కొరతే లేదంటూ ప్రకటనలు చేస్తుండటంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు వ్యవసాయశాఖ వైఫల్యమే ప్రధాన కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విత్తనాల అంచనా, సరఫరా ప్రణాళికలో లోపమే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య ఉన్నదని తెలిసినా పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలో అధికారుల నిర్లక్ష్యం కూడా రైతులకు శాపంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. 15 రోజులు కిందటే పచ్చిరొట్ట విత్తనాల సమస్య ఏర్పడింది. అయినా, అధికారులు ఆ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల చర్యలు లేక సమస్య రోజురోజుకు పెరిగి తీవ్రమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.