Dharani Portal | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్‌పై రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక ప్రశ్నను సంధించింది. కొత్త ప్రభుత్వం ధరణిని కొనసాగిస్తుందో లేదో చెప్పాలని ఆదేశించింది. ధరణిని రద్దు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. గతంలో తామిచ్చిన ఆదేశాల అమలు గురించి విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ధరణిని కొనసాగించాలని భావిస్తే గనుక.. గత ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని ఆదేశిస్తామని వెల్లడించింది. ధరణిని రద్దు చేస్తారా లేక కొనసాగిస్తారా.. ఏ విషయమో తేల్చి చెప్పాలని కోరింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి.. ప్రభుత్వ వైఖరిని తెలుసుకొని చెప్పేందుకు కనీసం నాలుగు వారాల గడువు కావాలని కోరారు. అందుకు అనుమతించిన హైకోర్టు, ప్రభుత్వ సమాధానాన్ని ఫిబ్రవరి 2న జరిగే తదుపరి విచారణ నాటికి తెలియజేయాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో వివిధ సర్వే నంబర్లలోని 146.06 ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను స్థానిక తహసీల్దార్ ఇవ్వడం లేదని, ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేరొంటూ హైదరాబాద్‌కు చెందిన ఏ జైహింద్‌రెడ్డి ఇతరులు గత ఏడాది వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ధరణి పోర్టల్ వల్ల ఎదురయ్యే పలు సమస్యల పరిషారానికి చర్యలు తీసుకోవాలని సీసీఎల్ ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆదేశించినట్టు గుర్తుచేశారు.
సమస్యల పరిషార మాడ్యుల్‌ను రూపొందించలేదని, సమస్యల పరిషార నివేదిక సమర్పించలేదని చెప్పారు. ఇంతలో ఏజీ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుని ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ధరణిని రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడిస్తే ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం ఉండబోదని, ధరణిని కొనసాగించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపితే.. గత ఉత్తర్వుల అమలు గురించి వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు.