హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. ఆయా స్థానాలకు గాను మొత్తంగా 20,313 మంది అభ్యర్థులు 29,694 నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ మేరకు వార్డులు, డివిజన్ల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలను శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో 10,024 నామినేషన్లు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి 7,556 నామినేషన్లు, బీజేపీ నుంచి 5,457 నామినేషన్లు దాఖలయ్యాయి. క్షేత్రస్థాయిలో అధికారం దకించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తున్నది. అధికార పార్టీకి పోటాపోటీగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గత పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ఆ పార్టీ బరిలోకి దిగింది. బీజేపీ సైతం 5,457 నామినేషన్లతో తన ఉనికిని చాటుకున్నది. మరోవైపు, అధికారిక గుర్తింపు లేని చిన్న పార్టీలు (రిజిస్టర్డ్ పార్టీలు), స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా భారీగానే ఉన్నది. దాదాపు 3,745 మంది స్వతంత్రులు బరిలో నిలువడం గమనార్హం.
ఇది ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎంఐఎం నిజామాబాద్ జిల్లాతోపాటు ఇతర పట్టణాల్లోనూ వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ నుంచి 576 నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం నుంచి 284, ఆప్ 50, టీడీపీ 30 చొప్పున నామినేషన్లు పడ్డాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో వైఎస్సార్సీపీ నుంచి ఒక్క నామినేషన్ దాఖలైంది.
నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పరిశీలన, ఉపసంహరణపై పడింది. నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తిరస్కరణకు గురికాగా మిలిగిన తుది అభ్యర్థుల జాబితాను సాయంత్రం వెల్లడించారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడంపై ప్రధాన పార్టీల అధిష్ఠానాలు కసరత్తు మొదలుపెట్టాయి. నామినేషన్లు ఉపసంహరించుకొనేలా అభ్యర్థులకు నచ్చజెప్పడంలో తలమునకలయ్యాయి. చివరికి మున్సిపల్ ఎన్నికల బరిలో ఎవరుంటారో? అన్న విషయం ఫిబ్రవరి 3న తేలిపోనున్నది. అదే రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనున్నది.

