యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నది. పాడి రైతుల కల్పతరువు అయిన నార్ముల్‌ను మూసివేసేందుకు కంకణం కట్టుకున్నది. ఆ దిశగా ఒక్కొక్కటిగా చర్యలకు ఉపక్రమిస్తున్నది. సంస్థకు ఆయువుపట్టు అయిన యాదగిరిగుట్టకు నెయ్యి సరఫరా బంద్ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆలయాలు, హాస్టళ్లకు పాలు, నెయ్యి సరఫరా నిలిపేసి డెయిరీని దివాలా దిశగా నడిపిస్తున్నది. దీంతో పాడి రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. వేలాది మంది రైతులు రోడ్డు పాలయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియల్ లిమిటెడ్ (నార్ముల్) 40 ఏండ్లుగా పాడి ఉత్పత్తిదారులకు ఆసరాగా నిలుస్తున్నది. దీని పరిధిలో 32 వేల మంది పాడి రైతులు, 432 సొసైటీల ద్వారా రోజుకు 63 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నది. 3లక్షల మంది వినియోగదారులకు పాలు, పాల ఉత్పత్తులను అందిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మదర్ డెయిరీని కాపాడుతామని ఆ పార్టీ నేతలు గొప్పగా హామీలు ఇచ్చారు. కానీ నేడు అదే సంస్థను అథఃపాతాళానికి తొక్కేస్తున్నారు. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, చెర్వుగట్టు, వేములకొండ తదితర ఆలయాలు, హాస్టళ్లకు మదర్ డెయిరీ పాలను సరఫరా చేసేది. ఈ ఏడాది జనవరి నుంచి నార్ముల్ పాలకు బదులు విజయ పాలను కొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో యాదగిరిగుట్ట ఈవోగా ఉన్న భాస్కర్‌రావు ఆలయానికి ఈ ఏడాది డిసెంబర్ వరకు మినహాయింపును ఇవ్వాలని కోరడంతో మదర్ డెయిరీ నెయ్యినే సరఫరా చేస్తున్నారు. తాజాగా దేవస్థానం అధికారులు మదర్ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, నెయ్యి సరఫరా కోసం దేవాదాయ శాఖ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర సర్కా ర్ మాత్రం అనుమతికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అయిలయ్య, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి.. ఇటీవల మంత్రి సురేఖను కలవడానికి వెళ్తే సమయం కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. మదర్ డెయిరీ స్థానంలో గుట్టకు కూడా విజయ డెయిరీ నెయ్యి సరఫరా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.
మదర్ డెయిరీ సంస్థ ఇప్పటికే రూ.70 కోట్ల మేర నష్టాల్లో ఉన్నది. సంస్థకు యాదగిరిగుట్ట దేవస్థానం అతి పెద్ద ఆదాయ వనరు. సుమారు నలభై సంవత్సరాలుగా గుట్టలో లడ్డూలు, ఇతర ప్రసాదాలకు డెయిరీ నెయ్యినే వినియోగిస్తున్నారు. నార్ముల్ నుంచి ఒక్క గుట్టకే నెలకు 30 టన్నుల నెయ్యి సరఫరా అవుతున్నది. ఇందుకుగాను రూ.18 కోట్ల వరకు దేవస్థానం చెల్లిస్తున్నది. ఈ ఏడాది నెయ్యి నాణ్యతపై పరీక్షలు కూడా నిర్వహించారు. అందులో స్వచ్ఛమైన నెయ్యిగా ఎఫ్ఎస్ఎస్ఐ తేల్చింది. ఇప్పుడు మరో సంస్థకు ఇస్తే స్వచ్ఛమైన నెయ్యి సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో డెయిరీ మరింతచతికిలపడే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా నార్ముల్‌కు పాల సరఫరా చేసే రైతుల్లో 70 శాతం మంది యాదాద్రి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. సంస్థ దివాలా తీస్తే రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
డెయిరీలో పాడి రైతులకు 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కొంతకాలంగా డబ్బులు సకాలంలో జమ చేయడంలేదు. ఇటీవల కాలంలో నెలకు ఒక్క బిల్లు ఇచ్చి.. మరొకటి పెండింగ్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం 7 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో బిల్లు సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. అంటే రూ.35 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది బయట అప్పులు చేయాల్సి వస్తున్నది. మరోవైపు రుణాలతో గేదెలను కొన్న రైతులు ఈఎంఐలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు మదర్ డెయిరీకి పాలు పోయ డం మానేస్తున్నారు. బిల్లులు సక్రమంగా ఇ స్తుండటంతో వేరే సంస్థలకు విక్రయిస్తున్నారు.
ఓ వైపు సంస్థను దివాలా తీయిస్తూనే.. మరోవైపు ఆస్తులను అమ్మకంపై పాలక వర్గం దృష్టిసారించింది. ఈ ఏడాది జనవరిలో సభ్యులకు నోటీసులు జారీ చేసి, సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని విలువైన 30.5 ఎకరాలను అమ్మాలని పథకం వేశారు. చిట్యాల పరిధిలో 29 ఎకరాలు, మిర్యాలగూడలో 1.5 ఎకరాలు విక్రయించాలని భావించారు. ఇందులో పెద్ద కుంభకోణానికి తెరదీస్తున్నారని అప్పట్లోనే బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే భూముల అమ్మకంపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉన్నది. ఎలాగైనా భూములు అమ్మాలనే యోచనలో పాలకవర్గం ఉన్నట్టు తెలుస్తున్నది.