హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు మరో రూ.2,300 కోట్ల అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఆర్బీఐ ప్రతి మంగళవారం నిర్వహించే (డిసెంబర్ 30న) ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ పేర్కొన్నది. 17 ఏండ్ల కాలానికి రూ.500 కోట్లు, 23 ఏండ్ల కాలానికి రూ.800 కోట్లు, 28 ఏండ్ల కాలానికి రూ.1000 కోట్ల అప్పు తీసుకొనేందుకు సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాంగ్రెస్ సర్కారు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వార్షిక రుణ లక్ష్యం రూ.54,009 కోట్లుగా ప్రతిపాదించింది. కానీ డిసెంబర్ 2వ తేదీనాటికే రూ.66,000 కోట్ల (122.20 శాతం) అప్పు చేసింది. వార్షిక రుణ లక్ష్యాన్ని దాటి 22 శాతం అదనంగా అప్పు చేసింది. ఇప్పుడు మరో రూ.2,300 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉన్నది. ఈ నాలుగు నెలల్లో రుణ లక్ష్యం 150 శాతం నుంచి 200 శాతానికి చేరుతుందా? అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.