సైదాబాద్, జూన్ 10: ఆర్టీసీ బస్‌పాస్ చార్జీలను పెంచి నిరుపేద విద్యార్థులపై రా ష్ట్ర ప్రభుత్వం పెనుభారం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఒక్కో విద్యార్థిపై నెలకు సగటున రూ.300కు పైగా అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బస్‌పాస్ చార్జీల పెంపును నిరసిస్తూ హైదరాబాద్‌లో మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్‌భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కవిత సహా ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచకుండా, బస్‌పాస్ చార్జీలనే పెంచడం భావ్యంకాదని హితవు పలికారు. ఆర్టీసీ ఆదాయం పెరిగే మార్గాలను ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ ఆర్టీసీ సంస్థకు నిధులు కేటాయించి సంస్థను కాపాడారని తెలిపారు. ప్రస్తుత సీఎం కూడా సరిపడా నిధులు కేటాయించి ప్రజలపై భారం పడకుండా చూడాలని సూచించారు. మహిళలు, పురుషులు బస్సుల్లో కూర్చునే పరిస్థితులు లేవని, నిలబడి ప్రయాణించాల్సి వస్తున్నదని తెలిపారు. బస్సుల సంఖ్యను పెంచాలని టికెట్లు కొనే ప్రయాణికులే ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా రూట్లలో విద్యార్థుల కోసం బస్సు సర్వీసులు లేకపోవడంతో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పెంచిన బస్‌పాస్ చార్జీలను తగ్గించేంతవరకు ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.