హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఉపాధి హామీ సిబ్బందికి 3,4 నెలలుగా వేతనాలు రాక, ఆ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో స్పందించిన సర్కారు.. మంగళవారం రెండు నెలల వేతనాలకుగాను రూ.62 కోట్లు విడుదల చేసింది.
ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు (ఏపీవో), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా మొత్తం 10,400 మందికి రెండునెలల పెండింగ్ వేతనాలు విడుదల చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు 4 నెలలకుగాను మూడు నెలలు, ఏపీవో, ఈసీ, సీవో మూడు నెలలకుగాను రెండు నెలల వేతనాలు మాత్రమే చెల్లించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాన్ని మాత్రం పెండింగ్లో ఉంచింది.