హైదరాబాద్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు. ఈసారి ఏకంగా ఏఐసీసీ నేతలనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను బీజేపీలోకి వెళ్లానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడారు. బీజేపీలో తనకు ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి కాంగ్రెస్‌లోకి పిలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రే కలిసి తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఢిల్లీ పెద్దలు తనపై ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ‘భువనగిరి సీటు గెలిపిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’ అని కేసీ వేణుగోపాల్‌రెడ్డి మాట ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి, అధిష్ఠానానికి ఇబ్బందులు ఉండవచ్చని, అయితే వారు తనతో మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు ఇబ్బందికరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గమని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా ఎన్నికల్లో పార్టీ పనితీరును అధిష్ఠానం ప్రశంసించడంపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచారని, మునుగోడు ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ గెలిచిందని గుర్తుచేశారు. నిజంగా ప్రజల్లో ఏం ఉన్నది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం? అన్నది ముఖ్యమని తెలిపారు. గతంలో ఏ సీఎం ఇన్ని శాఖలు త న వద్దే పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఒం టెద్దు పోకడలు నచ్చకనే తాను గతంలో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. తనకు బీజేపీ జాతీయస్థాయిలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెం బర్, రాష్ట్రంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని నమ్మి వచ్చానని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. నన్ను అవమానించిన తీరు బాగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం తన విషయంలో తప్పు చేసినప్పటికీ, ఢిల్లీకి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు.