మంచిర్యాల, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. లేకుంటే క్యాతనపల్లిలోనే ఉండనివ్వం.. మిమ్ముల్ని బతకనివ్వం’ అంటూ బహిరంగంగా అధికార కాంగ్రెస్ దౌర్జన్యాలు. ‘ఎన్ని డబ్బులు కావాలో చెప్పండి పడేస్తాం.. కానీ కాంగ్రెస్‌లో చేరాల్సిందే’ అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై, వారి బంధువులపై ఒత్తిళ్లు. ‘మా మాట వినకపోతే క్యాతనపల్లిలో మీకు ఇల్లే లేకుండా చేస్తాం. ఈ ఏరియాలో మీరు ఎలా తిరుగుతారో చూస్తాం. మీకు సింగరేణి ఇచ్చిన పట్టాలనూ రద్దు చేస్తాం. మమ్ముల్ని కాదంటే మీ అంతు చూస్తాం’ అంటూ భయభ్రాంతులు.. ఇవీ మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దక్కించుకొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అరాచకపర్వానికి మచ్చుతునకలు. పైవిధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను, వారి కుటుంబాలను ప్రలోభపెట్టేందుకు మంత్రి వివేక్ అనుచరులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఎలాగైనా సరే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకొని.. మంత్రి వివేక్ కండ్లల్లో ఆనందం చూసేందుకు కాంగ్రెస్ నాయకులు గూండాలుగా మారి రెచ్చిపోతున్నారు. అధికార, ఆర్థిక బలం చూసుకొని.. బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్ల కుటుంబాలను, వారి బంధువులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
11వ వార్డు కౌన్సిలర్ ఇంటిపై దాడి
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన బొమ్మ భూమయ్యగౌడ్ ఇంటిని లక్ష్యంగా చేసుకొని సింగరేణి ఎస్ఎంపీసీ (సింగరేణి సెక్యూరిటీ అండ్ పర్సనల్ కంట్రోల్), రెవెన్యూ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం దాడులు చేశారు. కౌన్సిలర్ ఇంటిని చుట్టుముట్టి అల్లకల్లోలం సృష్టించారు. కౌన్సిలర్ భార్య విజయతో పాటు వారి కూతురు ముందే దౌర్జన్యకాండకు తెగబడ్డారు. మీ ఇల్లు సింగరేణి స్థలంలో ఉన్నదని, దానిని కూల్చేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేశారు. మీ ఇంటిపక్కన ఉన్న స్థలం సింగరేణి ఆక్రమిత స్థలమని, అందులో ఉన్న సామగ్రినంతా వెంటనే తీసేవేయాలని హుకుం జారీచేశారు. ఖాళీస్థలం చుట్టూ ఏర్పాటు చేసుకున్న కంచెను విచక్షణారహితంగా తొలగించి రాక్షసానందం పొందారు. అప్పటికప్పుడు ‘ఈ స్థలం సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందినది. దీనిని ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అని ఉన్న బోర్డును ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ భార్య విజయ దిక్కులు పిక్కటిల్లేలా విలపిస్తూ అధికారులను వేడుకున్నా వారు కనికరం చూపలేదు. ఖాళీ స్థలంలో ఉన్న టెంట్‌హౌజ్ సామగ్రిని తామే తీసుకెళ్తామంటూ హడావుడి చేశారు. టెంట్‌హౌజ్ సామగ్రిని చిందరవందరగా పడేసి నానా బీభత్సం సృష్టించారు. అధికారుల ప్రవర్తనతో విజయ భయపడిపోయారు. ‘నా భర్త లేరు. ఇప్పటికిప్పుడు సామగ్రి తీసేందుకు ఎవరూ అందుబాటులో లేరు’ అని బతిలాడినా వినిపించుకోలేదు. దీంతో ఆమె రోడ్డుపైకి వచ్చారు. ఆమె అరుపులు, ఏడుపులు విని స్థానికులు గుమిగూడటంతో రేపటిలోపు సామగ్రి అంతా తీసివేయాలని, ఆ స్థలంలో ఆరబోసిన వడ్ల కుప్పను సైతం తొలగించాలని, లేనిపక్షంలో మొత్తం తామే తీసుకెళ్తామంటూ హెచ్చరికలు జారీచేసి వెళ్లిపోయారు.
ధైర్యం చెప్పిన కొప్పుల
క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్లో బాధితురాలు విజయతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కొప్పుల ఈశ్వర్‌తో గజగజ వణుకుతూ గద్గద స్వరంతో మాట్లాడారు. నేను వస్తానమ్మా, ధైర్యంగా ఉండమని కొప్పుల ఈశ్వర్ చెప్పగా, అన్నయ్యా నాకు భయమేస్తుంది.. అంటూ భోరున విలపిస్తూ భయాందోళన వ్యక్తంచేసింది. విజయ కుటుంబంపై దాడిని స్థానికులు ఖండించారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
30 ఏండ్లుగా అదే నివాసం: స్థానికులు
సింగరేణి స్థలంలో ఉన్నదని చెప్తున్న ఇంట్లో భూమయ్యగౌడ్ కుటుంబం దాదాపు 30 ఏండ్లుగా ఉంటున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పక్కనున్న సింగరేణి స్థలాన్ని వ్యవసాయ అవసరాలకు వాడుకుంటూ, ఆవులు, బర్రెలు కట్టేస్తున్నారు. అప్పుడప్పుడూ టెంట్‌హౌస్ సామగ్రి కూడా అక్కడే పెట్టుకుంటారని చెప్తున్నారు. ఇన్ని రోజులు కనిపించని సింగరేణి స్థలం ఇప్పుడే ఎందుకు కనిపించిందో అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు. ఒకవేళ సింగరేణికి ఆ స్థలం కావాల్సి వస్తే నోటీసు ఇచ్చి తీసుకోవాలనే తప్ప.. ఇలా దౌర్జన్యానికి దిగడం ఏమిటంటూ స్థానికులు మండిపడుతున్నారు.
జర్నలిస్టులను చూసి జారుకున్న అధికారులు
భూమయ్యగౌడ్ ఇంటిపై దౌర్జన్యం విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న జర్నలిస్టులను చూసి అధికారులు జారుకున్నారు. ‘ఏం చేస్తున్నారు సార్’ అని అక్కడికి వచ్చిన సింగరేణి అధికారులను జర్నలిస్టులు ప్రశ్నించారు. సింగరేణి స్థలాన్ని ఆక్రమించారు స్వాధీనం చేసుకుంటున్నామంటూ సదరు అధికారి సెలవిచ్చారు. ఎప్పుడు అక్రమించారు. ఇన్ని రోజులు ఏం చేశారు అంటే.. సరైన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి జారుకున్నారు. భూమయ్యగౌడ్ కుటుంబం రెండు, మూడు రోజులుగా ఊరిలో లేరు. ఈ క్రమంలో పలుమార్లు అధికారులు వచ్చి రెక్కీ నిర్వహించారని స్థానికులు చెప్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఏదో చేద్దామని ప్రయత్నించారని, చివరకు ఈ రోజు భూమయ్యగౌడ్ కుటుంబం వచ్చిందని తెలుసుకొని కావాలనే వచ్చి దాడులు చేశారంటున్నారు. అధికారం కోసం ఇంతగా దిగజారుతారా? కౌన్సిలర్‌గా గెలవడమే వాళ్లు చేసిన తప్పా? మంత్రి వివేక్, ఆయన అనుచరులు ఇంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించడమేమిటని స్థానికులు మండిపడుతున్నారు.
ముగ్గురు కౌన్సిలర్లకు 9 కోట్ల ఆఫర్?
బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లను ప్రలోభపెట్టడంలో మంత్రి వివేక్ అనుచరులైన క్యాతనపల్లిలోని స్థానిక కాంగ్రెస్ గూండాలు తలముకలైపోయారు. సుమన్ అరెస్టు అయిన రోజు ఉదయాన్నే కొందరు కౌన్సిలర్ల ఇండ్లలోకి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ‘డబ్బులిప్పిస్తాం. మా పార్టీలోకి రావాలి’ అంటూ ప్రలోభపెట్టినట్లు తెలుస్తున్నది. తాము చెప్పినట్టు వినకపోతే క్యాతనపల్లిలో మీరు ఎలా బతుకుతారో చూస్తామంటూ.. డబ్బులు తీసుకొని మద్దతు తెలిపితే మర్యాదగా ఉంటుందంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగినట్టు స్థానికంగా చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో ఓ ముగ్గురు కౌన్సిలర్లను ఒక్కొక్కరికి రూ.3 కోట్ల చొప్పున వివేక్ అనుచరులు రూ.9కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. నేరుగా కౌన్సిలర్లతో మాట్లాడే వీలు లేకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ విషయం తెలిపి, ఎలాగైనా బీఆర్ఎస్ క్యాంప్‌లోని మీ వాళ్లకు సమాచారం ఇవ్వండి.. ఓటింగ్ రోజు కాంగ్రెస్ ప్రతిపాదించే చైర్మన్‌కు చేయి ఎత్తితే చాలంటూ చెప్పి వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నేడు క్యాతనపల్లికి బీఆర్ఎస్ బృందం
బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమయ్యగౌడ్ ఇంటిపై దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండిచారు. శనివారం క్యాతనపల్లికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కొప్పులతోపాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు రానున్నారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం క్యాతనపల్లిలోని బాల్కసుమన్ నివాసంలో వారు మీడియాతో మాట్లాడనున్నారు.
కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రాణహాని: విజయ
ఇంటిపై దాడి, అధికారుల దౌర్జన్యకాండ అనంతరం కౌన్సిలర్ భూమయ్యగౌడ్ భార్య విజయ మాట్లాడుతూ భయాందోళన వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే మేమేమైనా చేస్తామని మమ్ముల్ని మంత్రి వివేక్, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు పల్లె రాజు, మరో నాయకుడు అజీజ్ మాకు డబ్బులు ఇస్తామని ఫోన్లు చేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదని మా శివాజీనగర్‌లో ఉన్న కాంగ్రెస్ లీడర్లతో ఫోన్లు చేయించిండ్రు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే సరి.. లేకపోతే మిమ్ముల్ని ఏమైనా చేస్తామంటూ బెదిరించారు.
మొన్ననే ఇల్లు కూడా దొబ్బేస్తామని భయపెట్టారు. మేం బీఆర్ఎస్ నుంచి గెలిచినం.. బీఆర్ఎస్లోనే ఉంటామని చెప్పినం.. చెప్పింది వినకపోతే ఏం చేస్తామో చూడండంటూ బెదిరించారు. ఇదంతా చేస్తున్నది కాంగ్రెస్ లీడర్లు పల్లెరాజు, అజీజ్, శివాజీనగర్‌లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే. వాళ్లే ఫోన్లు చేసి మమ్ముల్ని, మా కుటుంబాలను శివాజీనగర్‌లో ఉండనివ్వమని బెదిరిస్తున్నరు. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణహాని ఉన్నది. ఇంటి పక్కనున్న స్థలంలో ఆవును కట్టేసి ఉంటే దానిని అక్కడి నుంచి తోలుకెళ్లి ఇంటి ముందు కట్టేసే దాకా ఊరుకోలేదు. ఇంత దౌర్జన్యంగా టెంట్‌హౌస్ సామాను చిందరవందర చేసిండ్రు.. వడ్ల కుప్ప కూడా తీసేయాలని చెప్పిండ్రు. రేపటిలోపు తీయకుంటే అంతా తీసుకెళ్తామన్నరు. ఎందుకు ఇదంతా చేస్తున్నారని అడిగితే.. కొత్తగూడెం నుంచి కైంప్లెంట్ వచ్చిందని చెప్తున్నారు. మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మేము మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నం. పేపర్లు చూయించమంటే చూపిస్తా. ఎన్నికల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ సైతం తీసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్పండి అంటే చెప్పకుండా ఇంత దౌర్జన్యం చేశారు. ఇల్లంతా నాశనం చేసిండ్రు’ అని విజయ విలపిస్తూ తన ఆవేదనను వ్యక్తంచేసింది.