Congress Govt | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది పంట నష్టపోయిన రైతుల పరిస్థితి. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది. ఈసీ నుంచి అనుమతి వచ్చి పది రోజులు గడిచినా ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్న కారణంగా పంపిణీ చేయలేకపోతున్నామని, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మే రకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లే ఖ కూడా రాసింది. స్పందించిన ఈసీ పరిహా రం పంపిణీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే ప ది రోజులు గడిచినా ప్రభుత్వం మాత్రం పం పిణీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి రూ. 15.81 కోట్లు అవసరమవుతాయి. ఈసీ అనుమతినిచ్చినా ఇంకా పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వం మొత్తం ఈ కొద్దిపాటి మొత్తం కూడా లేదా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే పరిహారం పంపిణీ చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.