Telangana | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ దిగువ జలాలు సరిపోతాయని, అందుకోసమే పులిచింతల ప్రాజెక్టును నిర్మించారని పేర్కొంటూ.. జూరాల నీటి వినియోగంపై షరతులు పెట్టడం కుదరని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. తెలంగాణ, ఏపీ మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదంపై అంతరాష్ట్ర నదీ వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం విచారణ జరపాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1,005 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు కలిపి మొత్తం 1,050 టీఎంసీల జలాలను రెండు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలను జారీచేసిన విషయం విదితమే.
ఆ విచారణకు సంబంధించి ఇరు రాష్ర్టాలు ఇప్పటికే ఎస్‌వోసీని (స్టేట్మెంట్ ఆఫ్ కేస్)లను సమర్పించాయి. విచారణ అంశాల జాబితా కూడా ఇప్పటికే సిద్ధమైంది. అయితే, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాన్ని మాత్రమే సాక్షుల ద్వారా విచారించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించడంతోపాటు అఫిడవిట్‌ను కూడా దాఖలు చేసింది. దీనిపై బుధవారం ఢిల్లీలో జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఏపీ తరఫున అనిల్ కుమార్ గోయెల్‌ను, తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, జూరాల వద్ద నీటి వినియోగంపై నియంత్రణ విధించాలని, పోలవరం నుంచి గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు తదితర అంశాలపై అనిల్ కుమార్ గోయెల్ తన అఫిడవిట్లో లేవనెత్తిన అంశాలపై వైద్యనాథన్ పలు ప్రశ్నలు సంధించారు.
కృష్ణా జలాలను ప్రాజెక్టులవారీగా కాకుండా గంపగుత్తగా వినియోగించుకునే విధంగా ట్రిబ్యునల్-1 కేటాయించిందని, దీన్ని సుప్రీంకోర్టు సైతం నిర్ధారించిందని గుర్తుచేశారు. జూరాల వద్ద కేవలం 37.84 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణను నియంత్రించాలని, ఆ మేరకు షరతులు విధించాలని ఏపీ చేసిన వాదనను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. తెలంగాణలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులు జూరాలపై ఆధారపడి ఉన్నందున అక్కడ నీటివినియోగంపై నియంత్రణ కుదరదని తేల్చిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. నాగార్జునసాగర్ దిగువన క్యాచ్మెంట్ ఏరియాలో జనరేట్ జలాలను పులిచింతల, ప్రకాశం బరాజ్ ద్వారా ఏపీ వినియోగించుకుంటున్నదని వైద్యనాథన్ తెలిపారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ గురువారం కూడా కొనసాగనున్నది.