Telangana Budget | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గించింది. ఇందుకు బడ్జెట్లో రూ.33,486 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.2,21,242 కోట్లుగా చూపింది. అంటే నిర్వహణకు చేస్తున్న వ్యయంతో పోల్చితే అభివృద్ధి కోసం చేస్తున్న ఖర్చు కేవలం ఏడో వంతు మాత్రమే.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు మూల ధన వ్యయంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఏటా కేటాయింపులను పెంచింది. పైగా.. అదనంగా ఖర్చుచేసింది కూడా. ఉదాహరణకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూల ధన వ్యయానికి రూ.37,524 కోట్లు కేటాయించింది. అంచనాలకు మించి రూ.44,252 కోట్లు ఖర్చు చేసింది. రూ.6,728 కోట్ల మేర అదనపు నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆస్తుల కల్పన కోసం వెచ్చించింది.
కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు నిరుటి వ్యయంతో పోల్చితే సుమారు రూ.10,766 కోట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మౌలిక సదుపాయాల అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరుగక.. కుంటుపడుతుందన్న విమర్శలు మొదలయ్యాయి.
