హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రమాణాలను పాటించిందని చెప్తూ మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కరీంనగర్ ప్రజలుగానీ, ప్రజాప్రతినిధులుగానీ ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి..? కాస్త లోకజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్కో, రాష్ట్ర ప్రభుత్వానికో కృతజ్ఞతలు చెప్పాలని అంటారు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం గమనార్హం.
‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు, తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బండికి కనీస జ్ఞానం లేదని చురకలంటిస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. కేంద్రం దేశవ్యాప్తంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 150కిపైగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. కానీ, తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించకుండా తీవ్ర వివక్ష చూపింది.
తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అవకాశాలను పెంచేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి.. కేవలం అనుమతి పత్రాలు ఇచ్చినందుకు కేంద్రాన్ని పొగడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలు అని బీజేపీవాళ్లు చెప్పుకుంటారు’ అని సీఎం కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.