హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్ల అప్పులు చేయడం ఆ శాఖ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ఎవరో చెప్పిన కాకి లెక్కలు కాదు.. స్వయంగా బడ్జెట్లోని ‘ప్రభుత్వ పూచీలు, రుణ పరిస్థితి’ పట్టికలో రాష్ట్ర సర్కారే వెల్లడించింది. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ ఏడాది ఫిబ్రవరి 28నాటికి ప్రభుత్వ పూచీకత్తుతో సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ రూ.54,491 కోట్ల రుణాలు తెచ్చింది.
ఇలా ఒక్క ఏడాదిలో, అది కూడా నెల రోజులు మిగిలి ఉండగానే ఇంత భారీస్థాయిలో అప్పులు చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ధాన్యం కొనుగోలుకు, రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నయాపైసా ఇవ్వకపోవడంతో అప్పులే దిక్కయ్యాయని అధికారులు చెప్తున్నారు. మార్చి 18న మార్క్‌ఫెడ్ సహకారంతో ఎన్సీడీసీ నుంచి మరో రూ.22,700 కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం. ఇవి కూడా కలిపితే ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో రూ.76వేల కోట్లకు చేరుతుంది.
ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం పౌర సరఫరాల శాఖ మెడలో గతంలోనే అప్పుల గుదిబండ ఉన్నది. 2025 మార్చి 1వ తేదీనాటికి ప్రభుత్వ పూచీకత్తుతో రూ.57,188 కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన పాతవి, కొత్తవి(ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి) కలిపితే సివిల్ సైప్లెస్ శాఖ అప్పులు రూ.1,11,679 కోట్లకు చేరడం సంచలనంగా మారింది. అయితే 2025 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తీసుకున్న అప్పుల్లో ఎంత చెల్లించిందనే వివరాలను సర్కార్ ఈ పట్టికలో పొందుపర్చలేదు. అయితే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం కార్పొరేషన్ అప్పు రూ.75వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
సివిల్ సైప్లెస్ అప్పులు రోజురోజుకూ పెరిగిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు, రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులు రావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీ బకాయిలు చెల్లించడం లేదని తెలిసింది. ఇప్పటివరకు ఖజానా నుంచి సివిల్ సైప్లెస్కు నయాపైసా ఇవ్వలేదని తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. సీజన్ మొదలైందంటే చాలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని అధికారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ ద్వారా ధాన్యం కొనుగోలుతో పాటు సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఈ పథకాలకు సంబంధించి ఏటా రూ.4వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉం టుంది.
కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నిధు లు ఇవ్వలేదని తెలిసింది. అప్పులు తీసుకొచ్చి వీటికి చెల్లిస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చే శారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సైప్లెస్కు నిధులు ఇవ్వకపోవడం వల్ల సంస్థ అప్పులు పెరిగిపోయాయని, ప్రస్తుతం అప్పులు రూ.52 వేల కోట్లు ఉన్నాయని ఆరోపించా రు. కానీ అప్పుడు విమర్శించిన వారే ఇప్పు డు అంతకుమించి అప్పులు చేస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్ పదేండ్లలో రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే రూ.54,491 కోట్ల రుణాలు సేకరించడం విస్మయం కలిగిస్తున్నది.