హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, బీసీ వర్గాల వెనుకబాటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి శాతం తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ పూనుకున్నది. అందులో భాగంగా రెండేండ్ల క్రితమే బీసీ ఉద్యోగుల సమాచారాన్ని, వివరాలను అందించి సహకరించాలని ఆయా ప్రభుత్వశాఖలకు విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రభుత్వశాఖలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో బీసీ ఉద్యోగుల సమాచారాన్ని సమర్పించలేదు. ఇదే విషయమై సమాచారం ఇవ్వని ఆయాశాఖల ఉన్నతాధికారులకు కమిషన్ పలుమార్లు లేఖలు సైతం రాసింది. ఈ నేపథ్యంలో ఇటీవల బీసీ కమిషన్ సమావేశం నిర్వహించి మరోసారి హెచ్చరించింది.
తాజాగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో ఖైరతాబాద్ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెట్రరీ బాల మాయాదేవి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 345 ప్రభుత్వ విభాగాల్లోని 45 ప్రభుత్వ విభాగాలు వివరాలు అందించలేదని గుర్తించారు.
10 రోజుల్లో వివరాలు సమర్పించని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మరోవైపు విద్యార్థుల వివరాల సేకరణ కూడా వేగవంతం చేయాలని, బీసీ కులాలకు సంబంధించిన పుస్తకాలు, రిసెర్చ్ మెటీరియల్, వివిధ రిపోర్టులతో లైబ్రరీని నిర్ణయించింది.