Data Leak Case | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): డాటా చౌర్యం కేసులో సమాచారం లీకైన బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల విచారణకు రంగం సిద్ధమైంది. రెండురోజుల క్రితం 11 ప్రధాన సంస్థలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఆయా సంస్థల్లో డాటా నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఈ నెల ఐదు నుంచి విచారించనున్నట్టు తెలిసింది. 42 ప్రత్యేక అంశాలతో కూడిన ప్రశ్నావళిని సైతం రూపొందించినట్టు తెలిసింది.
ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు లేదా వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలపై విచారించనున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తునకు సంబంధించి సోమవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో అధికారులు అంతర్గత సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ కేసును దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం సిద్ధమవుతున్నాయి. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.