హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, టెస్ట్‌లు నిర్మాణ ఏజెన్సీనే చేయాలి అని పట్టుబడుతున్న సర్కారు మరోవైపు ఎస్ఎల్బీసీపై అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. నిర్మాణ ఏజెన్సీపై ఏ మాత్రం భారం పడకుండా సర్కారే అన్నింటినీ చక్కబెడుతున్నది. ఖర్చులన్నీ భరిస్తున్నది. అక్కడివరకు బాగానే ఉన్నా ప్రభుత్వ ఖర్చుతో మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్‌ను ఎందుకు నిర్వహించారని ఏకంగా ఈఎన్సీ అనిల్‌కుమార్ బదిలీ వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ సర్కారు ద్వంద్వనీతిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్‌లో 20వ నంబర్ పిల్లర్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని సాంకేతిక లోపాలపై ఎన్డీఎస్ఏ తొలుత గతేడాది మేలో ప్రాథమిక నివేదికను అందించింది. వర్షాకాలంలో బరాజ్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గేట్లన్నీ తెరిచి పెట్టాలని, నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా చూడాలని, దెబ్బతిన్న, కొట్టుకుపోయిన సీసీ బ్లాక్‌లను రిప్లేస్ చేయాలని, తదితర రక్షణ చర్యలను చేపట్టాలని సూచించింది. మరోవైపు ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన పనులను క్షేత్రస్థాయిలో అమలుచేస్తూ పర్యవేక్షించేందుకు, ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు ఇరిగేషన్శాఖతోపాటు, శాఖతో సంబంధంలేని వివిధ విభాగాలకు చెందిన విషయ నిపుణులతో వేర్వేరుగా కమిటీలను వేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు.
అందులో భాగంగా ప్రభుత్వం సైతం అప్పటి ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి బరాజ్‌ల రక్షణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 7వ బ్లాక్‌లో పిల్లర్ దిగువ ఏర్పడిన బొయ్యారాన్ని పూడ్చాలని సూచించింది. కమిటీ సిఫారసులతో అధికారులు సదరు పనులను పూర్తిచేశారు.
ఆ బిల్లులను మంజూరు చేయాలని ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన పనులన్నీ బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీతోనే ఎందుకు చేయించలేదని, ప్రభుత్వ ఖర్చుతో ఎందు కు చేయించారంటూ అధికారులపై సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈఎన్సీ అనిల్‌కుమార్‌పై ఏకంగా బదిలీ వేటు వేసింది. మరోవైపు ఎల్అండ్టీ కొత్తగా ఆయా పనులకు అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని చెప్తున్నది.
కాంగ్రెస్ సర్కారు ఎస్ఎల్బీసీ ఘటనలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ఇన్లెట్ సొరంగం గత ఫిబ్రవరిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8మంది కార్మికులు ప్రాణాలను కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల అచూకీని గుర్తించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ పనులను పూర్తిగా ఈపీసీ విధానంలోనే అప్పగించింది. సొరంగానికి సంబంధించిన ప్రతిదీ నిర్మాణ ఏజెన్సీనే పూర్తిగా భరించాలి. ఇది కాంట్రాక్టు అగ్రిమెంట్లోనే ఉంది. కానీ సర్కారే ఇన్లెట్ ప్రమాద ఘటనను పూర్తిగా తలకెత్తుకున్నది.
నిర్మాణ ఏజెన్సీపై ఏమాత్రం భారం పడకుండా అన్ని పనులనూ ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తున్నది. అన్ని విభాగాలతో రెస్క్యూ చర్యలను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహించింది. తదుపరి పనులను కొనసాగించేందుకు కావాల్సిన పరీక్షలను కూడా సర్కారు ఖర్చుతోనే చేపట్టేందుకు సిద్ధమైంది. విదేశాల నుంచి పరికరాలను తెప్పించేందుకు సమాయత్తమైంది. వాస్తవంగా ఆ పనులన్నీ ఏజెన్సీనే సొంత ఖర్చుతో చేయాలి.