ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/మొగుళ్లపల్లి/తుర్కపల్లి/కల్హేర్, ఫిబ్రవరి 24 : రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక.. సాగు చేసిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలవ న్మరణానికి పాల్పడగా.. రుణమాఫీ సమ స్యతో మరో రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలు రాజన్న సిరి సిల్ల, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచే సుకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలో సాగు నీరందక.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్కు చెందిన జెల్ల దేవయ్య (51)కు గ్రామంలోని ముత్యంపేట గుండ్ల వద్ద ఎకరం సాగు భూమి ఉండగా, మరో ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకున్నాడు.
నాలుగేండ్ల క్రితం కూతురి పెండ్లి కోసం రూ.4 లక్షలు అప్పు చేశాడు. రూ.1.50 లక్షలు అప్పు చేసి కొడుకును రెండేండ్ల క్రితం దుబాయ్ పంపించగా.. అక్కడ పనిలేక ఆరు నెలలకే తిరిగొచ్చాడు. నిరుడు తొమ్మిదెకరాల్లో పంట పండింది. చేతికొచ్చిన దశలో వడగళ్ల వానతో పంట మొత్తం రాలి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది నక్కవాగుకు నీళ్లు రాక భూగర్భజలాలు అడుగుంటి బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. వరుస తడులతో పొలం కాపాడుకుంటూ అక్కడడే ఉంటున్నాడు. బావుల్లో నీరు అడుగంటి పంటలు ఎండుతుండటంతో ఆవేదన చెందాడు. 10 లక్షల వరకు ఉన్న అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందాడు. ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన దేవయ్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన రైతు మంద చంద్రయ్యకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. బస్వాపూర్ జలాశయం ప్రధాన కాల్వ నిర్మాణంలో 2 ఎకరాల భూమిని కోల్పోయాడు. ఎకరంన్నరలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇద్దరు కూతుళ్ల పెండ్లిళ్లు చేయడంతోపాటు బోర్లు వేయడంతో రూ.14 లక్షల అప్పు అయ్యింది. పత్తి పంట దిగుబడి రాలేదు. వరి పంట ఎండిపోయింది. అప్పు ఎలా తీర్చాలనే మనోవేదనతో ఆదివారం పొలం వద్ద పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రైతు అరికాంతపు రాజు (38) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు తనకున్న మూడెకరాల్లో మిర్చి, పత్తి పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం 25 లక్షల అప్పు చేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. మిరప తోటకు నీళ్లు పెట్టి వస్తానని ఇంట్లో నుంచి ఆదివారం రాత్రి వెళ్లాడు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోటకు వెళ్లి చూసే సరికి వేప చెట్టుకు ఉరివేసుకొని కన్పించాడు.
బ్యాంకు అధికారులు రుణమిస్తలేరనే బెంగతో సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కల్హేర్ మండలం మాసాన్పల్లికి చెందిన బుజ్రంపల్లి దుర్గయ్య (74) కల్హేర్లోని ఎస్బీఐలో 47,637 పంట రుణం తీసుకున్నాడు. 2015 నాటికి వడ్డీతో కలిపి రూ.68 వేలు అయింది. ‘నీ డబ్బులు మొండి బకాయి కింద జమ అయింది. రుణం చెల్లిస్తే తిరిగి వెంటనే మంజూరు చేస్తాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. దుర్గయ్య అప్పుచేసి నిరుడు నవంబర్లో రూ.68 వేలు చెల్లించాడు. రుణం కోసం మూడు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. మూడు రోజుల కింద బ్యాంకుకు వెళ్లి రుణం ఇస్తారా లేదా? అంటూ అధికారులను ప్రశ్నించాడు. అటు రుణమాఫీ పైసలు రాకపోగా చెల్లించిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం బోరుబావి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. చిన్న కోడలు పశువులకు నీళ్లు పెడతామని పొలానికి వెళ్లింది. దుర్గయ్య నిద్రలో ఉన్నాడనుకొని లేపడానికి ప్రయత్నించింది. ఎంతకూ లేవకపోగా అప్పటికే చనిపోయినట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. బ్యాంకు రుణం ఇవ్వకపోవడంతోనే బెంగతో హఠాన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.