హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. 2026 జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి.
ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటలకు వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్లో పరీక్షలు ఉంటాయి. జనవరి 3న పేపర్-2 గణితం, సైన్స్ పేపర్తో పరీక్షలు ప్రారంభమై.. జనవరి 20న పేపర్-2 (మైనర్), గణితం, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ పేపర్లతో ముగుస్తాయి. జిల్లాలోని మొత్తం అభ్యర్థులకు ఒకే సెషన్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.