కేసీఆర్ ప్రభుత్వం మూడేండ్లలో కాళేశ్వరం కట్టింది. రెండేండ్లలో సచివాలయం నిర్మించింది. రెండేండ్లలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి చూపించింది. కానీ.. పొద్దునలేస్తే ఫ్యూచర్ సిటీ అంటూ ఊదరగొడుతున్న రేవంత్ సర్కార్.. ప్రకటన దగ్గరే ఆగిపోయింది. ఆనంద్మహీంద్రా చైర్మన్‌గా రేవంత్ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన స్కిల్వర్సిటీ.. రెండున్నరేండ్లు కావస్తున్నా ఇంకా పునాదుల్లోనే కొట్టుమిట్టాడుతున్నది.
రంగారెడ్డి, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ‘భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేండ్లలో పూర్తి చేస్తం. ఇది నాలుగో నగరంగా మారుతుంది. అమెరికా, సింగపూర్‌తో పోటీ పడేలా చేస్తం’.. పదేపదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న మాట ఇది! మంత్రులు సైతం ఫ్యూచర్ సిటీ గురించి ‘ఆహా.. ఓహో’ అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ చేతల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్యూచర్ సిటీ పాట పాడుతున్నది. రెండున్నరేండ్లుగా గ్రాఫిక్స్‌లో చూపించడం తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మూడున్నరేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చరిత్ర సృష్టించింది. సచివాలయంతోపాటు రాష్ట్రంలో అనేక ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువుకంటే ముందుగానే రికార్డు సమయంలో పూర్తిచేసింది. తద్వారా కేసీఆర్ సర్కా ర్ చేతల ప్రభుత్వంగా నిలువగా.. రేవంత్ సర్కార్ మాత్రం మాటల ప్రభుత్వంగానే మిగిలిపోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఫ్యూచర్‌సిటీ జపాన్ని అందుకున్నది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ, గ్రీన్ ఫార్మా, డాటా సెంటర్, నెట్ జీరో వ్యాలీ.. ఇలా ఎన్నో వస్తాయని హ డావుడి చేసింది. 500 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవం ఏమిటంటే ‘మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు తంగెళ్లు దాటడం లేదు’ అన్నట్టుగా తయారైంది. ఇందుకు యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీ ప్రత్యక్ష ఉదాహరణ. దీని నిర్మాణానికి 2024 ఆగస్టు 1న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో 57 ఎకరాల్లో నిర్మాణం చేస్తామని ప్రకటించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించ డం, ఉద్యోగావకాశాలను పెంపొందించే ల క్ష్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్సిటీ భవనాలు, హాస్టల్ సదుపాయం కల్పించాల్సి ఉన్నది. శంకుస్థాపన చేసి రెండేండ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు రెండుమూడు బ్లాకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మరికొన్ని పునాదులకే పరిమితమయ్యాయి. ఈ నిర్మాణాలు పూర్తి కావడానికి మరో మూడు నాలుగేండ్లయిన పడుతుందని అధికారులు చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములిచ్చిన వారి కుటుంబాల్లోని నిరుద్యోగులకు కూడా వర్సిటీలో శిక్షణ ఇప్పిచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించింది.
ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన చేసిన మొట్ట మొదటి నిర్మాణం స్కిల్ యూనివర్సిటీ. దీని పరిస్థితే ఇలా ఉంటే మిగతావాటి గురించి ఊహించుకోవచ్చని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యూచర్‌సిటీలో గ్రీన్ఫార్మా, స్పోర్ట్స్ వర్సిటీ, హెల్త్ ఎడ్యుకేషన్, డాటా సెంటర్లు వంటి యూనివర్సిటీలు ఏర్పా టు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆ వర్సిటీలకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పాట మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసింది కేవలం ఒక్క భవనమే. అదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనం. దీని నిర్మాణానికి 10 నెలల సమ యం తీసుకున్నది. ఈ భవనం బిల్టప్ ఏరియా 16వేల చదరపు అడుగులు మాత్రమే. 7.29 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ల కన్నా చిన్నది. ఒక్కో కలెక్టరేట్‌ను లక్షన్నర చదరపు అడుగుల్లో నిర్మించారు. 20 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం సచివాలయాన్ని కేవలం 28 నెలల్లోనే నిర్మించి రికార్డు సృష్టించింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అనేక నిర్మాణాలు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. ఇందుకు ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు. మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కి.మీ. సొరంగాలు, 1,531 కి.మీ. గ్రావిటీ కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్.. ఇలా అనేక నిర్మాణాల సమూహం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రభుత్వం కేవలం మూడున్నరేండ్లలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేసింది. అనేక సాగునీటి ప్రాజెక్టులను కూడా రికార్డు సమయంలో నిర్మించింది. ఇక రాజసౌధాన్ని తలపించే తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం కేవలం 28 నెలల్లోనే పూర్తిచేసింది. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ కింద అనేక ఫ్లైఓవర్లను వేగంగా అందుబాటులోకి తెచ్చింది.