హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రగతిబాట పట్టిన పట్టణాలు.. కాంగ్రెస్ ఈ రెండేండ్ల పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను స్వయంసమృద్ధి దిశగా నడిపించేందుకు కేసీఆర్ హయాంలో నెలకు సుమారు రూ.148 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసేవారు. ఫలితంగా పనులు చకచకా జరిగే పురపాలికలకు సమగ్ర వసతులు సమకూరాయి. తద్వారా దేశ సగటు కంటే తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పుంజుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో ఒక పకా ప్రణాళికను అమలు చేయగా, ప్రస్తుత పాలనలో ప్రాధాన్యాలు మారాయి.
ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కార్ చిన్న మున్సిపాలిటీల కంటే హైదరాబాద్, దాని చుట్టుపకల ప్రాంతాలపైనే పూర్తి దృష్టి పెట్టింది. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) పరిధిలోని శాటిలైట్ టౌన్‌షిప్‌లు, ఫ్యూచర్ సిటీ పేరుతో ఊహల్లో విహరిస్తున్నది. గడిచిన రెండేండ్లలో మున్సిపాలిటీలకు రాష్ట్ర సర్కార్ నిధులు విడుదల చేయక, కేంద్రం నుంచి నిధుల రాక పట్టణ ప్రగతిలో వేగం తగ్గినట్టు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణీకరణ వేగంగా పెరగడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నిధుల సమీకరణ, విడుదల జరిగేవి.
గత ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి వినూత్న కార్యక్రమంలో పట్టణాల రూపురేఖలు మారాయి. నిధులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఒక విధానపర నిర్ణయాన్ని అమలు పరిచింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ఈ కార్యక్రమానికి అనుసంధానించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నింటిలో ఆధునిక శ్మశానవాటికల నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. నైట్ షెల్టర్లు, వెజ్-నాన్ వెజ్ సమీకృత మారెట్ల నిర్మాణాలు నాడు చేపట్టారు. పట్టణ ప్రకృతి వనాల పేరుతో పారుల అభివృద్ధిని పెద్ద ఎత్తున నాడు చేపట్టారు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తాజా కూరగాయలు, పండ్లు, మాంసాన్ని ఒకేచోట అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్, నాన్-వెజ్ మారెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కనీసం ఒక సమీకృత మారెట్ ఉండాలనే లక్ష్యంతో సుమారు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టును నాడు చేపట్టారు. చిన్న మున్సిపాలిటీల్లో 2 నుంచి 4.5 కోట్ల వ్యయంతో, కార్పొరేషన్ స్థాయి పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన రూ.10 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 144 చోట్ల వీటిని నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో దాదాపు 125కి పైగా మారెట్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి.
వీటిలో కొన్నింటిని ప్రారంభించారు. సుమారు 15-20 మారెట్లు వివిధ కారణాల వల్ల (నిధుల విడుదల ఆలస్యం లేదా భూమి సమస్యలు) ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత మారెట్ ఆసియాలోనే అతిపెద్ద, అత్యాధునిక మారెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. రూ.30 కోట్లతో ఆరు ఎకరాల్లో, ఐదు బ్లాకులతో 264 దుకాణాలతో నిర్మించారు. ఈ మారెట్లలో కేవలం విక్రయాలకే కాకుండా, కోల్డ్ స్టోరేజ్, అధునాతన వెంటిలేషన్ సిస్టమ్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, ప్రత్యేక పారింగ్ సదుపాయాలు కల్పించారు. కానీ, ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కార్ రెండేండ్లలో సమీకృత వెజ్, నాన్-వెజ్ మారెట్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
2023 చివరలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిలిపివేసింది. మూసీ పునరుజ్జీవం, హైడ్రా పేరుతో చెరువుల పునరుద్ధరణ, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలోని శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై ఎకువ దృష్టిపెట్టింది. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80 నుంచి 90% వరకు నిధులు వివిధ విడతల్లో విడుదలయ్యేవి. 2024-25లో పురపాలక శాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.11,692 కోట్లు ఉన్నప్పటికీ, వాస్తవంగా విడుదలైన నిధులు 9,470 కోట్లు (సుమారు 81%) మాత్రమేనని అంచనా. ముఖ్యంగా చిన్ని మున్సిపాలిటీలకు నిర్వహణ నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.17,677 కోట్లలో సింహభాగం (దాదాపు 10,000 కోట్లకు పైగా) హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, హైడ్రా వంటి ప్రత్యేక ప్రాజెక్టులకే కేటాయించారు. దీనివల్ల సాధారణ మున్సిపాలిటీలకు అందే వాటా పెరిగినట్టు కనిపించినా, అవి ప్రాజెక్ట్ ఆధారిత నిధులుగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీలకు అందనేలేదు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిరుడు రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా రెండేండ్లుగా మున్సిపాలిటీలకు నిలిచిపోయిన సుమారు రూ.3,000 కోట్లకు పైగా పాత పనుల బిల్లులు విడుదల కావాల్సి ఉన్నది. బకాయి బిల్లుల కోసం కాంట్రాక్టర్ల సంఘాల నేతలు ఆందోళనలకు దిగిన ఉదంతాలు రేవంత్ పాలనలో పతాక శీర్షికలయ్యాయి. చెరువుల సంరక్షణ, మూసీ నది పునరుజ్జీవం కోసం వేల కోట్లు కేటాయిస్తామని చెప్తున్న సర్కార్.. గల్లీల్లో డ్రైనేజీలు, వీధిలైట్లు వంటి చిన్నచిన్న పనులకు కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. తెలంగాణ పట్టణాల సమగ్రాభివృద్ధి కేవలం భారీ ప్రాజెక్టులతోనే సాధ్యం కాదని, ప్రతి పట్టణానికి అందాల్సిన సాధారణ అభివృద్ధి నిధులు నిలిచిపోతే మౌలిక సదుపాయాలు కుప్పకూలే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం 2025-26 బడ్జెట్లో రూ.17,677 కోట్లను పురపాలక శాఖకు కేటాయించగా, అందులో సింహభాగం హైదరాబాద్ నగరాభివృద్ధికి, కీలక ప్రాజెక్టులకే కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు, పాతబస్తీ మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు, హైడ్రా కోసం రూ.100 కోట్లు, వైకుంఠధామాలకు 75 కోట్లు, సమీకృత మారెట్లకు (వెజ్-నాన్ వెజ్) కోసం రూ.100 కోట్లు కేటాయించారు. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వచ్చే మూడేండ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
