విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మంగళం పాడేందుకు రేవంత్ ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తున్నది. సంక్షేమ పథకాల భారం నుంచి తప్పించుకోజూస్తున్న సర్కార్.. ఇప్పటికే పలు స్కీములను అటకెక్కించింది. ఆ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నీ రద్దు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. ఇకపై ఫీజుల మొత్తాన్ని కళాశాలలకు కాకుండా, విద్యార్థులకే ప్రభుత్వం చెల్లిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం జీవో 7 జారీ చేసింది.
అంటే కళాశాల ఫీజుల భారం నేరుగా విద్యార్థులపైనే పడనున్నది. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు కాలేజీ యాజమాన్యాలు వేచిచూడవు. ఫలితంగా విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అప్పు చేసైనా ఫీజులు కట్టే పరిస్థితి తలెత్తనుంది. పర్యవసానంగా లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముంది.
తానిచ్చిన గ్యారెంటీలకు తానే గొయ్యి తీసి పాతర పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాదరణ పొందిన సంక్షేమ కార్యక్రమాలనూ ఒక్కొక్కటిగా గొంతు నులుముతున్నది. న్యూట్రిషన్ కిట్, రైతుబీమా, రైతుభరోసా.. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్! ఇప్పటిదాకా కేసీఆర్ పథకాలనే నిలిపివేస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన రీయింబర్స్మెంట్ స్కీమ్ రద్దుకు కత్తి నూరుతున్నది.
ఆర్థిక అడ్డంకులను అధిగమించి, ఫీజుల భారం లేకుండా నచ్చిన కాలేజీలో ఉన్నతవిద్యను పూర్తిచేసేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లక్షలాదిమంది విద్యార్థులకు ఉపకరించింది.
కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా దాన్ని కొనసాగించగా, కాంగ్రెస్ రాకతో పథకానికి కష్టాలు మొదలయ్యాయి. చెల్లింపుల్లేక బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ఇంజినీరింగ్ కాలేజీలు నిత్యం పోరుపెడుతుండటం, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కుతుండటంతో రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాప్ పేరుతో రైతులను యూరియా లైన్లనుంచి తప్పించినట్టే, సవాలక్ష సాకులతో పంట కొనుగోళ్ల బాధ్యతనుంచి తప్పుకొన్నట్టే.. ఇప్పుడు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు సర్కార్ దెబ్బకొట్టబోతున్నది. అసంఘటితంగా ఉండే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగబోరన్న ఆలోచనతోనే పథకాన్ని పలుచన చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో కాలేజీలు మూతపడుతున్నాయి. దాటవేత ధోరణి మంచిది కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలి.
– 2016లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. పేద విద్యార్థుల కోసం నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ యథాతథంగా కొనసాగించారు. కాంగ్రెస్ తెచ్చిన పథకమనే భేషజాలకు పోకుండా స్కీమ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని బకాయిలు కూడా తీర్చితే.. ప్రస్తుతం అదే కాంగ్రెస్ పాలనలో రీయింబర్స్మెంట్ పథకానికి కత్తెరపడే ప్రమాదం కనిపిస్తున్నది.
రెండున్నరేండ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకుండా.. వనటైమ్ సెటిల్మెంట్ అని ఒకసారి, ట్రస్ట్ ద్వారా ఇస్తామని మరోసారి, కమిటీలంటూ పూటకోమాట చెబుతూ వచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పేరిట నేరుగా విద్యార్థుల ఖాతాలకే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను బదిలీ చేస్తామని జీవో 7 జారీ చేసింది. బకాయిల ఊసెత్తకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు యాజమాన్యాలకు నిధులు చెల్లించిన ప్రభుత్వం.. ఇకనుంచి నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. అదీగాక ఆధార్ సహిత అటెండెన్స్‌ను తప్పనిసరి చేసింది. నిర్దేశిత హాజరు ఉంటేనే తదుపరి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరవుతాయి.
ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు(ఆర్టీఎఫ్), మెయింటెనెన్స్ ఫీజు(ఎంటీఎఫ్) రీయింబర్స్మెంట్ నిధుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. అయితే మార్గదర్శకాలను పరిశీలిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమచేస్తుందో, లేదోననే సందేహంతో విద్యార్థులు ముందే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నది. దీని వల్ల ఫీజుల కోసం పేద విద్యార్థులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడమే గాక, స్థోమత లేని వాళ్లు అసలు చదువుకే దూరం కావాల్సి వస్తుంది.
రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500లకు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. అదేవిధంగా ఉపకార వేతనాలను కూడా చెల్లిస్తున్నది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ పథకానికి సంబంధించిన నిధుల విడుదల పూర్తిగా నిలిపేసింది. వాస్తవంగా ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లను 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
దాని ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభంలో 25శాతం, మధ్యలో 50శాతం, చివర్లో మరో 25శాతం చెల్లించాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ఆ విధానానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. 30నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే ఏడాది క్రితం నిర్దేశిత మొత్తాలతో టోకెన్లను జారీ చేస్తున్నా ఇంతవరకూ విడుదల చేయలేదు. దాదాపు రూ.10వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఈ విద్యాసంవత్సరం నిధులు కూడా కలిపి మరింత ఎక్కువగానే ఉంటాయని అధికారవర్గాలు, విద్యార్థి సంఘాలు వెల్లడిస్తున్నాయి.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీసీ సంఘాల నేతలు, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది క్రితమే బకాయి నిధుల కోసం యాజమాన్యాలన్నీ కలిసి కాలేజీల బంద్ చేపట్టాయి. దీంతో కులసంఘాల విజ్ఞప్తితో, విద్యార్థుల ఒత్తిడితో సర్కార్ సైతం నిధులను చెల్లిస్తామని బుజ్జగించింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి నిధులను రెగ్యులర్‌గా విడుదల చేస్తామని, బకాయిలను మాత్రం వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని నిరుడు జేఎన్టీయూ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ ఆ హామీని సర్కార్ నిలబెట్టుకోలేదు.
నిధులు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు మరోసారి ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నత విద్యాశాఖ అధికారులను కలిసి లేఖలను సమర్పించి వేడుకున్నాయి. కళాశాలలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని, భవనాల అద్దెలను దీర్ఘకాలికంగా చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, తాళాలు వేస్తున్నారని, కాలేజీ సిబ్బందికి వేతనాలను కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నదని ప్రాధేయపడ్డాయి. కానీ 2025-26 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో చేసేదేమీలేక మరోసారి నిరుడు డిగ్రీ పరీక్షలనే బహిష్కరించాయి. నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం రూ.1,207 కోట్ల మేరకు టోకెన్లు జారీ చేసినా ఒక్క రూపాయి విదిల్చలేదు.
ఆ తర్వాత మళ్లీ సర్కార్ మాటమార్చింది. ట్రస్ట్ ద్వారా, సీఎస్ఆర్ ఫండ్‌తో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను నిర్వహిస్తామని నమ్మబలికింది. ట్రస్ట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిరుడు నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా, ఆర్థికశాఖ సెక్రటరీ వైస్ చైర్మన్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఎడ్యుకేషన్, ఎస్సీ, బీసీ, ట్రైబల్, మైనారిటీ వెల్ఫేర్, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరామ్, ప్రతి అసోసియేషన్ నుంచి 3 మొత్తంగా 13మందిని మెంబర్లుగా కమిటీలో నియమించింది. ఈ కమిటీ ట్రస్ట్ ద్వారా పథకం అమలు, పారదర్శకత, హేతుబద్దీకరణకు తదితర అంశాలను అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది. కానీ ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది.
ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, మరోవైపు కాలేజీ యాజమాన్యాలను బుజ్జగించకుండా ఏకంగా బెదిరింపులకే దిగింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను పొందుతున్న అన్ని కాలేజీల్లో తక్షణం తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగానికి, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లకు ప్రభుత్వం నిరుడు ఏప్రిల్‌లో ఎగదోసింది. కాలేజీలు ఫీజు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామంటూ తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తనిఖీల నివేదికను సమర్పించడంతో పాటు, నోడల్ ఏజెన్సీతో కలిసి స్కీమ్‌కు సంబంధించి ప్రత్యేకంగా సిఫార్సులను కూడా చేయాలని విజిలెన్స్ డీజీని సర్కార్ ఆదేశించింది. ఇప్పటివరకు అదీ జాడ లేకుండా పోయింది.
ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం మూలంగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల ద్వారా ఏటా 14లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే అనేక మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకొస్తున్నారు. ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని వాపోతున్నారు. దీంతో అప్పులు చేసి కొందరు విద్యార్థులు సొంతంగా జేబుల నుంచి కాలేజీలకు ఫీజులను చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది.
ఆ స్థోమత కూడా లేని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి. కోర్సు పూర్తయినా సర్కార్ తీరుతో కేవలం సర్టిఫికెట్లు అందకనే లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాల నడుమ బలవుతున్నామని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇకపై కళాశాల ఫీజులను విద్యార్థులే చెల్లించుకోవాలని పేర్కొంటూ బుధవారం ప్రభుత్వం జారీచేసిన జీవో 7
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను మేం తీసుకురాలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చారు. బడుగు బలహీనవర్గాలకు విద్యను అందించే మంచి స్కీమ్. ఇది విద్యార్థులకు సంబంధించి సున్నితమైన అంశం. సామాజిక సమస్య ఇది. కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నా. ఈ స్కీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ అనేది నిర్దిష్టంగా ఉండదు. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నదా? ఎవరున్నారా? అనేది అనవసరం. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమే ఆ విధంగా ఉంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ బకాయిలు రూ.1,880 కోట్లు ఉన్నాయి. అవన్నీ చెల్లించాం.
– 2016లో అసెంబ్లీలో కేసీఆర్ (ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై షార్ట్ డిస్కషన్ సందర్భంగా)