శేరిలింగంపల్లి, కొండాపూర్ జూలై 11: నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన నిరుపేద బిడ్డలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని, నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దలే బినామీలతో అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబరు 37లో ఎన్నో ఏండ్లుగా గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలను కొందరు ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యంగా అక్కడి నుంచి తరిమివేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణించింది. శుక్రవారం శేరిలింగంపల్లి బసవతారకనగర్‌లో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, నవీన్‌కుమార్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి మధుసూదనాచారి పర్యటించి బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. నిరుపేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ 40 ఏండ్లుగా నివాసముంటున్న నిరుపేదల ఇండ్లు, గుడిసెలను కూల్చడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చేలా రేవంత్ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ సరార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలు, శ్రమజీవులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నదని వాపోయారు. రేవంత్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిత్యం కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బసవతారకనగర్ బాధితులకు పకా ఇండ్లు కట్టించి, వారికి న్యాయం చేయాలని కోరారు. బాధితులకు జరిగిన అన్యాయానికి రేవంత్ సరార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బసవతారకనగర్‌లో నిరుపేదల గుడిసెలు, ఇండ్లు కూల్చివేయడం రియల్ ఎస్టేట్ మాఫియా పనేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రెకాడితేగాని డొకాడని పేదలు ఉంటున్న ఈ ప్రాంతంలో బాధితులపై ప్రైవేటు మూకలు, హిజ్రాలతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో బసవతారకనగర్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి పేదల ఇండ్లు కూల్చడమే ప్రజా పాలనా అని నిలదీశారు. దొంగ డాక్యుమెంట్లతో ఇక్కడికొచ్చి ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, బీఆర్ఎస్ నాయకులు వాలా హరీశ్‌రావు, రాగం జంగయ్యయాదవ్, గుర్ల తిరుమలేశ్, రాజు ముదిరాజ్, అనిల్‌సింగ్, పరమేశ్, అంజమ్మ, నరేశ్, పర్నాది శ్రీకాంత్, రామకృష్ణగౌడ్, గోపరాజు శ్రీనివాస్, రోజా, కేఎన్ రాములు, ముద్దంగుల మల్లేశ్, ఎర్రబెల్లి సతీశ్, రాజు, నవీన్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేను గెలవంగనే మొదటి సంతకం మీ ఇండ్లకే పెడతానన్న రేవంత్ సారు ఇప్పుడు ఉన్న గుడిసెల్ని కూడ లేకుండా చేస్తున్నడు. మమ్మల్ని ఓట్ల కోసం వాడుకుంటున్నరే తప్ప మనుషులుగా చూస్తలేరు. ఎవలకో ఈ భూమిని కట్టబెట్టేందుకు మా గుడిసెలను కూలుస్తున్నరు. వాళ్లకు మా భూములే కావాలట. మేము అడిగింది అంతస్థులు కాదు, ఆస్తులు కాదు. మేముంటున్న గుడిసె జాగనే. ఎన్నో ఏండ్లకెళ్లి ఇకడే ఉంటున్నం. ఇప్పుడు పెద్దోళ్లకు మేలు చేసేందుకు మా బతుకుల మీద కొడుతున్నరు.
– యాదమ్మ, బాధితురాలు, బసవతారకనగర్
మా బతుకులు మారుస్తాడని నమ్మి రెండుసార్లు ఓట్లేసి గెలిపించినం. మా గూడు కూల్చివేస్తున్నా ఎమ్మెల్యే గాంధీ జాడ లేదు. వారం రోజులుగా తిండీతిప్పలు లేకుండా చంటి పిల్లలతో చీకట్లో ఉంటున్నం. అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే జాడే లేదు. గతంలో ఇలాగే జరిగినప్పుడు తిరుపతిలో ఉన్నా అన్నడు.
– లక్ష్మి, బాధితురాలు, బసవతారకనగర్
గుడిసెలు ఖాళీ చేయాలని రౌడీలతో, హిజ్రాలతో కొట్టించారు. రౌడీలు ముఖాలకు బట్టలు కట్టుకుని గుంపుగా వచ్చి కర్రలతో కొట్టారు. ఇష్టమొచ్చినట్లు కొట్టి ఖాళీ చేయకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. మాలాంటి పేదోళ్ల గతి అధ్వానంగా తయారైంది.
– చాంద్ బీ, బసవతారకనగర్