నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణాజలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికే ప్రభుత్వ పెద్దలు.. చీకట్లో మాత్రం పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల ద్రోహం చేసి మిన్నకుంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? అందునా ఈ ప్రాంత నీటి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసే గులాబీ పార్టీ అంత సులువుగా వదిలిపెడుతుందా? అందుకే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ కుట్రల్ని ఛేదించారు. చంద్రబాబుతో కుమ్మక్కై కృష్ణాజలాల్లో పాలమూరు గడ్డకు చారిత్రక అన్యాయం చేస్తున్న తీరును ఎండగట్టారు. నిజం నిప్పులాంటిది… డాక్యుమెంట్ల రూపంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చీకటి ఒప్పందాన్ని చీల్చుకుంటూ బయటికొస్తూనే ఉన్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): జల ద్రోహం బట్టబయలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు కరువైంది. ప్రభుత్వ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే అన్నట్టుగా ‘పాలమూరు’ ధోకాను బీఆర్ఎస్ మీద నెట్టేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు. ఏడాది కిందటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చినా ఆ సత్యాన్ని తొక్కి పెట్టి ఇప్పుడు కేసీఆర్ హయాంలోనే వాపస్ వచ్చిందంటూ బుకాయిస్తున్నారు. అసలు గత ప్రభుత్వమే 45 టీఎంసీలను సిఫార్ చేసిందంటూ అడ్డగోలు వాదనలకు దిగు తున్నారు. మరి… నిజంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఎప్పుడు వెనక్కి వచ్చింది? వాస్తవానికి గత రెండేండ్లుగా ఈ ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి? పాలమూరు కు ధోకా తలపెట్టిందెవరు? నోరు తెరిస్తే అబద్ధా లు వల్లెవేస్తున్నదెవరు? ఒక్కసారి ఈ డాక్యుమెంట్లను పరిశీలిస్తే చాలు! దూద్‌కా దూద్… పానీకా పానీ!! ప(చ్చ)చ్చి కుట్రలన్నీ కండ్ల ముందు కనిపిస్తాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లుగా అటకెక్కించి, చివరకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన 90 టీఎంసీల నీటికి సైతం గండికొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబుతో అంటకాగి తెలంగాణ నీటి హక్కులకే ఎసరు పెడుతున్న వైనం బట్టబయలైంది. తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ నీటిని కేటాయించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్ర భుత్వం.. సగం అంటే 45 టీఎంసీలు మాత్రమే చాలు! అని ఎందుకు లేఖ రాసిందనే ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలెవరూ సమాధానం చెప్పకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. అసలు ఈ కుట్రకు సూత్రధారులెవరు? పాత్రధారులు ఎంతమంది? హైదరాబాద్‌లోనా? అమరావతిలోనా? దీనికి బీజం ఎక్కడపడింద నే దానిపైనే తెలంగాణలో చర్చ జరుగుతున్నది. బండారం బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు అబద్ధాలకు తెర లేపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చిందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాదిస్తున్నది. మరి ఇదే నిజమైతే ఈ రెండేండ్లల్లో జరిగిన ఈ పరిణామాలకు బాధ్యులెవరో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

1. డీపీఆర్ లేకుండా ‘పాలమూరు’కు జాతీయ హోదా ఎలా అడిగారు?
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి పోయి వస్తూనే ఉన్నారు. అనేకసార్లు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోరిన ట్టు సీఎంవో ప్రకటనలు ఇచ్చింది. దీంతోపాటు అధికారంలోకి వచ్చిన నెలలోపే అంటే 04.01.2024న సీఎం రేవంత్ కేంద్రానికి ఇచ్చిన వినతిపత్రంలో జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని 16.02.2024 న స. హ. చట్టం కింద అడిగిన మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఇచ్చిన సమాధానంలోనే అధికారంగా స్పష్టంచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ జాతీయ హోదా అడిగిన స మయంలో కేంద్రం వద్దనే పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ ఉన్నట్టు తేలిపోయింది. కేసీఆర్ హయాంలోనే డీపీఆర్ వెనక్కి పంపినట్లయితే రేవంత్ జాతీయ హోదా అడిగిన సమయంలోనే తమ వద్ద డీపీఆర్ లేదనే వాస్తవాన్ని కేంద్రం చెప్పి ఉండేది. అంతేకాదు.. స.హ. చట్టం కింద కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో 19.09.2022న అంటే కేసీఆర్ హయాంలో తమకు డీపీఆర్ వచ్చిందని స్పష్టం చేసింది.
2.డీపీఆర్ లేకుంటే వివరాలు ఎందుకు అడిగారు?
సాధారణంగా ఒక ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే క్రమంలో కేంద్ర జల సంఘం డీపీఆర్‌ను పరిశీలించి అందుకు అనుగుణంగా అదనపు వివరాలను ఆయా రాష్ర్టాలను అడుగుతుంది. రేవంత్ ప్రభుత్వం చెప్తున్నట్టు కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చినట్లయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండొద్దు. కానీ కాంగ్రెస్ హయాంలో 04.04.2024న పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌లోని అదనపు వివరాలను ఇవ్వాల్సిందిగా కేంద్ర జల సంఘం డైరెక్టర్ పీఏ(సౌత్) పం పిన ఈ-మెయిల్లో డైరెక్టర్ సూచించారు. నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ విజయభాస్కర్‌రెడ్డి 27.4.2024న కేంద్రానికి నివేదిక ఇచ్చా రు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సం బంధించి కేంద్రం పలు వివరాలను కోరినందున మైనర్ ఇరిగేషన్ డాటాను సమర్పిస్తున్న ట్టు అందులో పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే డీపీఆర్ వెనక్కి వస్తే కేంద్రం 2024, ఏప్రిల్‌లో డీపీఆర్‌ను ఎందుకు పరిశీలించింది? నాగర్‌కర్నూల్ సీఈ ఎందుకు పంపా రు? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా.
3. ఇప్పుడు పంపిన డీపీఆర్ ఎక్కడిది?
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు పెద్దలు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఇది పట్టనట్టుంది. 19.12.2024న కేంద్ర జల సంఘం తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీకి లేఖ పంపింది. గతంలో తెలంగాణ కేంద్ర జల సంఘానికి సమర్పించిన వార్దా, కాళేశ్వరంలోని మూడో టీఎంసీతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లు వెనక్కి పంపుతున్నామనేది ఆ లేఖ సారాంశం. పాలమూరు ప్రాజెక్టును ప్రస్తావిస్తూ…2024, ఏప్రిల్‌లో వివరాలు కోరామని, కానీ ఇప్పటికీ ఆ వివరాలు పంపలేదని, డీపీఆర్‌ను వెనక్కి పంపడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటని కేంద్రం అందులో స్పష్టంచేసింది. అంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం ఒకవంతు అయితే, డీపీఆర్‌ను 2024, డిసెంబర్లో వెనక్కి పంపినట్టు స్పష్టమవుతున్నది. కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపితే కాంగ్రెస్ హయాంలో వెనక్కి పంపిన డీపీఆర్ ఎక్కడిది? తమకు 2022, సెప్టెంబర్‌లోనే డీపీఆర్ వచ్చిందని, 2024 డిసెంబర్లో తిప్పి పంపుతున్నట్టు అధికారిక డాక్యుమెంట్లలో కేంద్రం చెబుతుంటే తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలను వల్లిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది.
