హైదరాబాద్, జూన్26 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇటీవల సమావేశాల నిర్ణయం మేరకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) జూలై 14న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సోమవారం లేఖ రాసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి ఆపరేషన్ ప్రొటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల డ్రాఫ్ట్ రూల్కర్వ్, డ్యామ్ సేఫ్టీ, క్యారీ ఓవర్, వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై కేంద్ర జలసంఘం రూపొందించిన ముసాయిదాపై చర్చించి తగిన సూచనలను చేసేందుకు కేఆర్ఎంబీ ప్రత్యేకంగా ఆర్ఎంసీని ఏర్పాటు చేసింది. ఇది ఆరుసార్లు సమావేశమై పలు సిఫార్సులు చేసింది.
ఈ సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. తమ వాదనలకు పూర్తి విరుద్ధంగా ఆర్ఎంసీ నివేదికను రూపొందించిందంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సిఫార్సులపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీని పునరుద్ధరించి ముసాయిదాపై మరోసారి చర్చించి సిఫార్సులు చేయాలని ఇటీవల నిర్వహించిన 17వ బోర్డు సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని బోర్డు పునర్వ్యవస్థీకరించింది. జూలై 14న కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు సభ్యులు, కమిటీ సభ్యులకు సమాచారం అందిస్తూ లేఖ రాసింది.