హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్థిక రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పటిష్ఠ ప్రణాళికతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏ రాష్ట్ర ప్రగతికైనా జీఎస్డీపీ, తలసరి ఆదాయమే ప్రామాణికం. ఆ రెండింటిలోనూ తెలంగాణకు తిరుగులేదని ఇప్పటికే తేలిపోయింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ జీఎస్డీపీ స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4,51,580 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.13,13,391 కోట్లకు వృద్ధి చెందినట్టు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) హ్యాండ్‌బుక్ వెల్లడించింది. అంటే, గత పదేండ్లలో దాదాపు మూడు రెట్లు (291 శాతం) పెరిగింది. తద్వారా దేశ జీడీపీ (రూ.2,72,03,767 కోట్లు)లో తెలంగాణ వాటా 4.8 శాతంగా ఉన్నది. ఇది ఎన్నో పెద్ద రాష్ర్టాల వాటా కంటే ఎక్కువ. చివరికి కొవిడ్ సంక్షోభ సమయంలోనూ రాష్ట్రం జాతీయ సగటు కంటే అధిక వృద్ధిరేటును నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ మైనస్ 1.4 శాతానికి పడిపోగా.. తెలంగాణ మాత్రం 1.2 వృద్ధిరేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,17,115కు చేరింది. అంటే గత పదేండ్లలో దాదాపు మూడు రెట్లు (రూ.2,04,953) పెరిగింది. తలసరి ఆదాయంలో జాతీయ వృద్ధిరేటు 13.7 శాతం ఉండగా.. తెలంగాణ 15.1 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత భారీ వృద్ధిరేటు నమోదు కాలేదు.