Telangana | హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కానీ ఇంతవరకు ఆ చెరువునీటిలో చేప పిల్లలను వేయలేదు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రతిఏటా చేపపిల్లలను కొని చెరువుల్లో వేస్తున్న తెలిసిందే. ఈ ఏడాది చేపల పంపిణీకి సరఫరాదారులెవరూ ముందుకురావడం లేదు. చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం గత నెల 9న టెండర్లను ఆహ్వానించగా సరైన స్పందన రావడం లేదు.
తొలిసారి ఒకే ఒక్క టెండర్ దాఖలు కావడంతో గడువు పొడిగించారు. రెండోసారి ముచ్చటగా ముగ్గురు మాత్రమే టెండర్ వేయడంతో మరోసారి గడువు పొడిగించారు. పాత బకాయిలు చెల్లించేంత వరకు టెండర్లు వేయబోమని సరఫరాదారులు తేల్చి చెబుతున్నారు. పాత బకాయిలు చెల్లించకుండా, వాటిపై హామీ ఇవ్వకుండా కొత్త టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత టెండర్ దాఖలు చేయాలంటే ఈఎండీ చెల్లించేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని, ఇక టెండర్లు ఏ విధంగా వేస్తామని అంటున్నారు.
ఈ ఏడాది 85 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ జూలై 9న నోటిఫికేషన్ జారీచేసింది. టెండర్ దాఖలకు జూలై 23 వరకు అవకాశం కల్పించింది. ఒకే ఒక టెండర్ దాఖలు కావడంతో గడువును ఆగస్టు 2 వరకు పొడగించింది. రెండోసారి కేవలం మూడు టెండర్లే దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఒకటి, మహబూబాబాద్ జిల్లాలో రెండు టెండర్లు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ ఈ నెల 13 వరకు గడువు పెంచారు. ఇప్పుడైనా పూర్తిస్థాయిలో టెండర్లు వస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. నిరుడు ఏకంగా 130 వరకు టెండర్లు దాఖలయ్యాయి.
నిరుడు సుమారు రూ.104 కోట్ల విలువైన 86 కోట్ల చేపలు, రొయ్య పిల్లల్ని ప్రభుత్వం పింపిణీ చేసింది. అయితే అప్పటికే ఎన్నికల హడావిడి మొదలుకావడంతో వీళ్లకు బిల్లులు చెల్లించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల పథకంపై విచారణకు ఆదేశించి, గత సరఫరాదారులకు బిల్లులను నిలిపేసింది. సరఫరాదారులు ఎన్నిమార్లు పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను, ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాజాగా ప్రభుత్వం పిలిచిన టెండర్లలో పాల్గొనకూడదని సరఫరాదారులు నిర్ణయించారు. పాత బకాయిలు చెల్లిస్తేగానీ టెండర్లలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు.