Irrigation Projects | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. షట్టర్లు, వియర్లు దెబ్బతిన్నాయి. వాటిని తక్షణం పునరుద్ధరించి సాగునీటిని అందివ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టపోవడం విమర్శలకు తావిస్తున్నది. సమీక్షలు తప్ప మరమ్మతులకు పైసా విదిల్చకపోవడంతో 25శాతం కూడా పనులు పూర్తికాలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క పనీ మొదలు కాలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 284చెరువులకు గండ్లు పడ్డాయి. మరో 274 చెరువుల వియర్లు, తూములు, షట్టర్లు దెబ్బతిన్నాయి. సాగర్ ఎడమకాలువ సహా మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 133 కాలువలు తెగిపోయాయి. 87చోట్ల మేజర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి స్కీమ్‌లోని వట్టెం, భక్తరామదాసు పంప్‌హౌస్, పలు ఐడీసీ లిఫ్ట్‌లు నీట మునిగాయి. మొత్తంగా 786 నిర్మాణాలు దెబ్బతినగా వాటి శాశ్వత మర్మమతులకు రూ.253.42కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ.23.90కోట్లు కావాలని అంచనా వేయగా ప్రభుత్వం రూ.75కోట్లే మంజూరు చేసింది. మొత్తంగా నిధులు రాకపోవడంతో సంబంధిత చీఫ్ ఇంజినీర్లే తమ పరపతిపై పనులు చేయిస్తున్నారు. అవీ మందకొడిగా కొనసాగుతున్నాయి.
786 పనుల్లో 190చోట్ల పూర్తయ్యాయి. మరో 37చోట్ల పురోగతిలో ఉండగా, 559చోట్ల మొదలే కాలేదు. ఇక ఓఅండ్ఎం పనులకు దాదాపు రూ.40 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం మంజూరు చేసిన వాటిలో సగానికిపైగా బకాయిల చెల్లింపునకే ఖర్చుకానున్నాయి. దీంతో ఆ నిధులతో పనులు ఎలా చేసేదని ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీళ్లున్నా మరమ్మతులు పూర్తికాక 5లక్షల ఎకరాలకు సాగునీరందని దుస్థితి నెలకొనడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చెరువులు, ఇతర పథకాలన్నీ కలిపి అత్యధికంగా వరంగల్‌లో 150చోట్ల, ఖమ్మంలో 109, ములుగులో 94, ఆదిలాబాద్‌లో 60, సూర్యాపేటలో 49చోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో పనులు మొదలు కాలేదు. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి సహా, మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ ఒక్క పనీ మొదలు కాకపోవడం గమనార్హం. నల్లగొండ, ములుగు, జిల్లాలదీ ఇదే పరిస్థితి. ప్రధానంగా ఎడమకాలువ మరమ్మతులు పూర్తికాకపోవడంతో నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొన్నది.
వర్షాలతో దెబ్బతిన ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులను ఆగమేఘాల మీద పూర్తిచేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢంకా బజాయించి చెప్పారు. చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలతో సమీక్షలు నిర్వహించారు. తెగిన సాగర్ ఎడమ కాలువను చూసేందుకు రెండు సార్లు పర్యటించారు. మీడియా ప్రతినిధులను సైతం వెంటబెట్టుకొని హెలికాప్టర్లో వెళ్లారు. కానీ సొంత జిల్లాలోనే పునరుద్ధరణ పనులు పూర్తిచేయలేకపోయారు. సాగునీరందించాలని సొంత జిల్లా రైతులే రోడ్డెక్కుతున్నారు.