1. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.
2. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి లేదా దానికి సమానమైన ఒక పథకాన్ని తెలంగాణకు ప్రకటించాలి.
3. రాష్ర్టానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించాలి.
4. తెలంగాణకు వైద్య కళాశాలలు, నవోదయ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను కేటాయించాలి.
5. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలి.
6. తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరిత, వివక్ష పూరిత పక్షపాత ధోరణిని విడనాడాలి.
7. మతతత్వ ధోరణిని విడనాడి, దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకొనే విధంగా పాలన సాగించాలి.
8. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిసారీ తమకు నిరాశే ఎదురవుతున్నదని పేర్కొన్నారు. తమ యువతకు విద్య, ఉపాధిలో గొప్ప మార్పులు వస్తాయని భావించామని, కానీ కేంద్రం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, రచయితలు, మేధావులు, బుద్ధిజీవులు బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం, వివరాలు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో ప్రతిసారీ తమకు నిరాశే ఎదురవుతున్నదని పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో తమ యువతకు విద్య, ఉపాధిలో గొప్ప మార్పులు వస్తాయని భావించామని, కానీ కేంద్రం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణకు వస్తున్న సందర్భంగా గతంలో కేంద్రం ఇచ్చిన హామీను గుర్తుచేస్తూ ఆయనకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈసారైనా హామీలను ఆచరణలో పెట్టాలని కోరారు.
భారత ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకాల్సిందే! గతంలో అనేకసార్లు ఆయన తెలంగాణకు వచ్చి అనేక ఉపన్యాసాలు, హామీలు ఇచ్చారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. కనీసం ఈ సారైనా ఇచ్చిన హామీల పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటిస్తారని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలంగాణ ప్రజల తరపున ఆయనకు గుర్తు చేస్తున్నాం. కేంద్రం తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని తెలంగాణ ప్రజలమైన మేము ఎన్నో కలలు కన్నాం. కానీ 8 ఏండ్లయినా విభజన హామీలు నెరవేరలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేదు. పారిశ్రామిక రాయితీల సంగతి మీరు (కేంద్రం) పూర్తిగా మరచిపోయారు. లక్షలాది తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు.
దేశవ్యాప్తంగా 22 సాప్ట్వేర్ పార్కులు ప్రకటించిన మీరు తెలంగాణకు మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం? దేశవ్యాప్తంగా వందలాది మెడికల్ కాలేజీలు, పదుల సంఖ్యలో ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు, నవోదయ పాఠశాలలు ప్రకటించిన మీరు ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణకు కేటాయించలేదు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లింది. అల్ప సంఖ్యాక వర్గాలు అనుక్షణం భయభ్రాంతులకు గురవుతున్నాయి. లౌకిక దేశం మతోన్మాద రాజ్యంగా మారిపోతున్నది. దళితులపై దాడులు పెరిగాయి. ఆహారపు అలవాట్లు, వేష భాషల పట్ల మీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తున్నది.
వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతున్నాయి. మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు చివరికి సైనిక దళాలను కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. విద్యుత్తు సంస్కరణల పేరిట రైతుల మెడపై మోటర్ల కత్తి వేలాడదీస్తున్నారు. పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి వచ్చింది. ఒకవైపు కోట్లాది మంది భారతీయులు పేదరికంలోకి జారిపోతుంటే మీ మిత్రులకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు దోచి పెడుతున్నారు.
మీ ఇద్దరు మిత్రులు ప్రపంచ కుబేరులుగా మారిపోయారు. 8 ఏండ్లలో రికార్డు స్థాయి దిగుబడులను సాధించిన తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనడంలో మీరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సింగరేణిని కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మా సమస్యలను వెంటనే పరిష్కరించండి. మీ తెలంగాణ పర్యటనలో వీటిపై మీ వైఖరిని తెలియజేయండి.
ప్రధానికి లేఖ రాసిన వారిలో ఓయూ, కాకతీయ తదితర యూనివర్సిటీల ప్రొఫెసర్లు రమా మేల్కొటే, షీలా ప్రసాద్, గట్టు సత్యనారాయణ, చెన్న బసవయ్య, రమణమూర్తి, ఘంటా చక్రపాణి, వీ కృష్ణ, పిల్లలమర్రి రాములు, రాఘవరెడ్డి, టీ శ్రీనివాస్, సీహెచ్ దినేశ్, సూరేపల్లి సుజాత, డీ పాపారావు, వై వెంకటేశ్వర్లు, పరశురాములు, ప్రేమ్‌కుమార్, ఎం రాములు, షుకూర్, దేవదాస్, ప్రసంగి, వడ్డానం శ్రీనివాస్‌రావు, గుంటి రవీందర్, వీ రామచంద్రం, ఎంఈ స్వామి, మల్లికార్జున్‌రెడ్డి, నారాయణ, ముస్తఫా, ఎస్ జ్యోతి, కే డేవిడ్, టీ శ్రీనివాసులు, ఎం రజని, పుష్ప చక్రపాణి, టీ శ్రీనివాస్, బన్న అయిలయ్య, కే అయిలయ్య, పీ అమరవేణి, సీ వెంకటయ్య, ఎస్వీ రాజశేఖర్, టీ శాస్త్రి, సుజాత, వై వెంకయ్య, రమేశ్, శ్రీనివాస్, కిశోర్‌కుమార్, పీవీ రమణ, మమత, పసునూరి రవీందర్, ఎస్ హరినాథ్, కృష్ణారావు, కృష్ణారెడ్డి, దయాకర్, మల్లారెడ్డి, బైరి నిరంజన్, శ్రీకాంత్, రచయితలు గోగు శ్యామల, జూపాక సుభద్ర, స్కైబాబా, అన్వర్, ఖలీదా పర్వీన్, ఖాజీ, సామాజిక కార్యకర్తలు ఉన్నారు.