హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ మహిళా నాయకులు గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఆధ్వర్యంలో మహిళలు తెలంగాణ భవన్ ముందుకొచ్చి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ముట్టడికి యత్నించారు. అధికార పార్టీ మహిళా నాయకులు కావడంతో పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. వారి ముట్టడికి పూర్తిగా సహకరించారు. ఎలాంటి అడ్డంకులూ కల్పించలేదు. బీఆర్ఎస్ నాయకులను అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తున్నా వారిని వారించలేదు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వారందరూ మీడియాతో మాట్లాడిన తర్వాత వారిని పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద మరో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయడానికి ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ మహిళా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు చోద్యంచూస్తూ వారికి సహకరించారే కానీ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అధికార పార్టీ కార్యాలయం వద్దకు ఇతర పార్టీల నాయకులను వెళ్లనిస్తారా? ముట్టడి చేయనిస్తారా? అంటూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.