Siddipet Train | సిద్దిపేట, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రా రంభోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ప్రొటోకాల్‌ను గాలికి వదిలేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టినా సిద్దిపేట రైలు ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటోలను విస్మరించారు. సమాచారం ఇవ్వడంలోనూ రైల్వే అధికారులు నిరక్ష్యంగా వ్యవహరించారు. ప్రారంభోత్సవ సమాచారాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం సిద్దిపేటలో సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో ‘దేశ్ కీ నేత కేసీఆర్ ’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి అనుకూలంగా నినదించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వ సోకులేంటని బీఆర్ఎస్ కార్యకర్తలు, సిద్దిపేట ప్రజలు నినదించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నా బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కొందరు కార్యకర్తలతోపాటు పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు కొనసాగింది. రైలు ప్రారం భం తర్వాత గొడవ సద్దుమణిగింది.
సమైక్య రాష్ట్రంలో మనోహరాబాద్- కొత్తపల్లి రైలు మార్గం కాగితాలకే పరిమితమైంది. అప్పటి ఆంధ్రా పాలకులు రాష్ట్రం వాటాను చెల్లించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. తెలంగాణ సిద్ధించి కేసీఆర్ సీఎం అయ్యాక మళ్లీ దీనికి కదలిక వచ్చింది. ఈ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 640 కోట్లకు పైగా చెల్లించింది. ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి కావడం దేశంలోనే తొలిసారి. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. వాస్తవం ఇలా ఉంటే బీజేపీ నాయకులు మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులు మొత్తం కేంద్రమే ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. మంగళవారం జరిగిన రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. బీజేపీ తీరు సొమ్ము ఒకరిది-సోకు మరొరకరిది అన్నట్టుగా తయారైందని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంబురాల మధ్య మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్టశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెర్గు మంజుల రాజనర్సుతో కలిసి మంగళవారం మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రైల్వేస్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట-సికింద్రాబాద్ (కాచిగూడ) రైలును ప్రారంభించారు. అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి రైలులో దుద్దెడ వరకు ప్రయాణించారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు గజమాలతో మంత్రి హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలికారు. బాణసంచా కాల్చి జై కేసీఆర్, జై హరీశ్‌రావు అంటూ నినాదాలు చేశారు. సిద్దిపేటవాసుల దశాబ్దాల కల నెరవేరడంతో రైలును చూసేందుకు రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగి, స్టేటస్లు పెట్టుకుంటూ సంతోషంగా గడిపారు.